NTV Telugu Site icon

AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. కీలక వాదనలు వినిపించిన సీఐడీ

Amaravati

Amaravati

AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్లపై చంద్రబాబు, నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఏపీ హైకోర్టు తుది విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఐడీ కీలక వాదనలు వినిపించింది. కేవలం అమరావతిలో ఎస్సీల దగ్గర ఉన్న భూములను తక్కువకు బినామీలతో నారాయణ కొనుగోలు చేయించారని సీఐడీ పేర్కొంది. వీటికి రక్షణ కల్పించేందుకు కేబినెట్ ఆమోదం లేకుండా జీఓ 41 తీసుకువచ్చారని కోర్టులో వాదనలు వినిపించింది. ఎస్సీల నుంచి భూములు బినామీలు కొని వారే హక్కుదారుగా చూపించాలనే కుట్రతో జీఓ 41 తీసుకొచ్చారని సీఐడీ తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలు అని, వారి స్టేట్‌మెంట్‌ను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందజేసింది. ఈ కేసులో బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో 18 కోట్లు ఉంటే ఇప్పుడు అది 600 కోట్లు ఉందని సీఐడీ న్యాయస్థానానికి వెల్లడించింది.

Also Read: AP CM Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ వీఎం రెడ్డి

చంద్రబాబు అండగా ఉన్నారనే మంత్రిగా నారాయణ ఈ బినామీ లావాదేవీలు నిర్వహించారని సీఐడీ ఆరోపించింది. సీఐడీ సీజ్ చేసిన ఫోన్స్‌లో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర మాట్లాడుకున్న కాల్ రికార్డ్ గుర్తించినట్టు సీఐడీ చెప్పింది. నారాయణ, ఆయన కుమార్తె సంభాషణ కాల్ రికార్డ్‌ను పెన్ డ్రైవ్‌లో వేసి న్యాయమూర్తికి అందజేసింది. అసైన్డ్ భూముల విషయంలో అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతి లాల్ దిండే, జేసీ చెరుకూరి శ్రీధర్ ఇబ్బందులు వస్తాయని చెప్పినా మంత్రి నారాయణ పట్టించుకోలేదని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌ల మీద స్టే ఉంటే ఏ విధంగా విచారణ చేశారని పిటిషనర్ ప్రశ్నించగా.. అసైన్డ్ భూములకు సంబంధించి దాఖలైన వేరే కేసుల్లో సీఐడీ విచారణ చేయగా ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఐడీ చెప్పింది.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రోజుల వ్యవధిలో స్టే తెచ్చారని టీడీపీ వ్యవహారం అలా ఉంటుందని సీఐడీ వ్యాఖ్యానించింది. తుది విచారణలో భాగంగా రేపటికి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. రేపు పిటిషనర్ తరపున న్యాయస్థానం వాదనలు విననుంది.