ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా, విమానాశ్రయ నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు, స్థానిక భూయజమానులకు ఒక రోజు పాటు ఉచితంగా విమాన ప్రయాణం సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ప్రాజెక్ట్ సాధనలో కీలక పాత్ర పోషించిన రైతులకు నివాళిగా, వారికి తగిన గౌరవం ఇవ్వడానికే ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతపు కలల ప్రాజెక్టు అయిన భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సహకరించిన ప్రతి రైతు కుటుంబం ఈ ప్రయాణానికి అర్హులవుతారని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంపై స్థానిక రైతులు, భూయజమానులు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ త్యాగాన్ని గుర్తించి ప్రభుత్వం ఇటువంటి గౌరవాన్ని అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం ప్రారంభమైన తొలిరోజే ఈ ఉచిత ప్రయాణాన్ని కల్పించనున్నారు.

