NTV Telugu Site icon

AP Budget: రూ.1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం

Ap Governor

Ap Governor

AP Budget: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ఆర్డినెన్స్ జారీ చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరం అని గెజిట్‌లో గవర్నర్‌ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ, ఇతర శాఖలతో ఇంకా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని గెజిట్‌లో స్పష్టం చేశారు. 40 ప్రభుత్వ విభాగాలకు సంబందించి డిమాండ్లతో కూడిన బడ్జెట్ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. మొత్తం 1.29 లక్షల కోట్ల బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేయడం గమనార్హం. 2024 సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.

Read Also: Pinnelli Ramakrishnareddy: పిన్నెల్లికి మరోసారి చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ

అన్న క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల రిపేర్లు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. రోడ్ల మరమ్మతులకు రూ. 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారుల అంచనా వేశారు. ఆగష్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం.. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు కేటాయించినట్టు సమాచారం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలలు సమయం పడుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది.

Show comments