NTV Telugu Site icon

Andhrapradesh: రైతులకు జగన్‌ సర్కార్ శుభవార్త.. ఆ రోజే అకౌంట్లలో నిధులు జమ!

Farmers

Farmers

Andhrapradesh: ఏపీలోని రైతులకు జగన్‌ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్‌ రైతు భరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్‌ విడుదల చేయనున్నారు. అన్నదాతలకు తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. అలాగే ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 30న కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి రైతుల అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేయనున్నారు.ఈ సంవత్సరం 52.31 లక్షలమంది అన్నదాతలకు తొలి విడతలో పెట్టుబడి సాయంగా రూ.7,500 చొప్పున రూ.3,934.25 కోట్లను సీఎం ఖాతాల్లో జమ చేస్తారు. పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా అందుకునే రైతుల సంఖ్య పెరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కింద అర్హులైన రైతులకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. మే నెలలో రూ.7,500.. రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడోవిడతగా జనవరిలో రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ నెలలో అందించనున్న సాయంతో కలిపితే.. ఈ నాలుగేళ్లలో సగటున 52.30 లక్షల మందికి వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.30,996.34 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లవుతుంది.

Read Also: Minister KTR: 2 వారాలు.. 80కి పైగా బిజినెస్‌ సమావేశాల్లో కేటీఆర్‌ ప్రసంగం

రైతు భరోసాతో పాటూ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు కూడా జగన్‌ సర్కారు సాయం అందించనుంది. సీజన్‌ ముగియకముందే ఇన్‌పుట్‌ సబ్సిడీ (పంట నష్టపరిహారం) నేరుగా వారి అకౌంట్‌లలోనే జమ చేస్తూ బాధిత రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో మాండూస్‌ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి 91,237 మంది రైతులకు రూ.76.99 కోట్ల నష్టపరిహారాన్ని ఫిబ్రవరిలో అందజేశారు.అకాల వర్షాలకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 78,510 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో 59,230 ఎకరాల్లో వ్యవసాయ పంటలు.. 19,280 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ మేరకు పంటలు దెబ్బతిన్న 48,032 మంది రైతులకు రూ.46.39 కోట్ల పంట నష్టపరిహారాన్ని ఈ నెల 30న సీఎం జమచేయనున్నారు. ఈ నాలుగేళ్లలో 22.70 లక్షల మంది రైతులకు రూ.1,958.18 కోట్ల పంట నష్టపరిహారం అందించినట్లు అవుతుంది.