Andhrapradesh: గోదావరి డెల్టాకు రబీకింద సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాల మేరకు సీఎంఓ అధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. గోదావరి డెల్టా ప్రాంత ఎమ్మెల్యేలు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, నీటి పారుదలశాఖ అధికారులు ఆ ప్రాంత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కార్యదర్శులు సమావేశమయ్యారు. గోదావరి డెల్టా కింద రబీకింద సాగుకు అవసరమైన నీటి వనరుల పరిస్థితులపై సమీక్ష చేశారు.
Also Read: TDP PAC Meeting: ఓటరు లిస్ట్ అవకతవకలపై టీడీపీ కీలక నిర్ణయం..
వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా రబీకి నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు తప్పకుండా సాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు. దీని కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఉన్న నీటివనరులు వృథా కాకుండా సాగు భూములకు చేరేలా సమర్థవంతమైన నీటి నిర్వహణకు వారంబందీ సహా అందుబాటులో ఉన్న పద్దతులను అనుసరించాలని నిర్ణయించారు. డెల్టా చివరి భూముల్లో పంటలు ఎండిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. కాల్వల్లో సాగునీటి ప్రవాహం సవ్యంగా ఉండేలా, షట్లర్లు ఇబ్బందులు ఉంటే వాటిని బాగుచేసేలా అలాగే సాగునీరు అందని భూములకు డీజిలు ఇంజిన్లద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read: Why AP Needs YS Jagan: వైసీపీ మరో కొత్త కార్యక్రమం.. రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్..
డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడానికి అవసరమైన అత్యవసర పనులు మంజూరుచేసి వాటిని వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లష్కర్ల సహా ఎక్కడా కొరతలేకుండా చూడాలని ఆదేశించారు. మెట్టభూముల్లో ఆరుతడి పంటలు, అపరాల సాగును ప్రోత్సహించాలని, ఆమేరకు రైతుల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గోదావరి డెల్టాకింద ఉన్న వివిధ జిల్లాల రైతు సలహామండళ్లతో చర్చించి నీటి విడుదలకు అవసరమైన తేదీలను, ఖరారు చేయాలని కలెక్టర్లకు నిర్దేశించారు. కచ్చితమైన షెడ్యూలు ప్రకటించి ఆమేరకు నీటిని అందించేలా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీని కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే ఉన్ననీటి వనరులను జాగ్రత్తగా వాడుకునేలా రైతులకు ఈ సలహా మండళ్ల ద్వారా అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో కూడా చర్యలు కూడా తీసుకోవాలని కలెక్టర్లకు చెప్పారు.
పంట కాలం పూర్తయ్యేంత వరకూ ఇరిగేషన్, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. రబీ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలిన వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన విత్తనాలు, సాగు పద్ధతులమీద రైతుల్లో అవగాహన పెంచేలా గ్రామస్థాయి వరకూ ప్రణాళిక రూపొందించాలన్నారు. గోదావరి డెల్టాకింద రబీకి సాగునీరు విడుదలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తంచేశారు.