AP Government: ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తే దానిని శాశ్వతంగా పరిగణించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, విద్యార్థులు, లబ్ధిదారులను ఒత్తిడి చేయొద్దని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు గ్రామ సచివాలయాల్లోనే ఆరు దశల తనిఖీ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. డిజీ లాకర్లతో సర్టిఫికేట్లు కులం, స్థానికత, పుట్టిన తేదీ సర్టిఫికేట్ల నిబంధనలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 469, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం జీవో ఎంఎస్ 484ను విడుదల చేసింది.
Also Read: Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు బిగ్ షాక్..
ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ఇచ్చింది. దానికి సంబంధించి అన్ని శాఖలకు త్వరలో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఏటా కుల, ఆదాయ ధ్రువీకరణలకు 1.20 కోట్ల సర్టిఫికేట్లను రెవెన్యూ శాఖ జారీ చేస్తోంది. కొత్త నిబంధనలతో 95 శాతం సర్టిఫికేట్ల జారీ తగ్గిపోనుంది. సంక్షేమ పథకాల కోసం వచ్చే లబ్ధిదారులను ఆయా ప్రభుత్వ శాఖ తాజా కుల ధ్రువీకరణ పత్రాలను అడుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు వాటికోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గతేడాది 52 లక్షల కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 42 లక్షలకు పైగా పత్రాలను అందజేశారు. వాటికి సంబంధించిన డేటా మొత్తం మీసేవా, ఏపీ సేవా కేంద్రాల్లో ఉంది. వాటి ద్వారా ఎలాంటి విచారణ లేకుండా కొత్త ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేలా కొత్త నిబంధనలను రూపొందించారు.
Also Read: Botsa Satyanarayana: కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం అలవాటుగా మారింది..
వీటి ద్వారా జారీ చేసిన కులధ్రువీకరణ పత్రం ఎప్పుడైనా చెల్లుబాటు అవుతుంది. లబ్ధిదారుడు గతంలో జారీ చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించినప్పుడు ప్రభుత్వ శాఖలు మళ్లీ తాజా సర్టిఫికేట్‌ను అడగకూడదు. మీసేవలో గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొందిన వారికి ఏ కేటగిరీ సేవగా తక్షణమే తాజా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. వారి కుల నిర్ధారణ కోసం తహసీల్దార్, ఇతర అధికారులు మళ్లీ విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ లబ్ధిదారుడి తండ్రి, సోదరుడు ఎవరైనా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొంది ఉంటే వారి బంధుత్వాన్ని పౌర సరఫరాల శాఖ డేటాబేస్ ద్వారా నిర్ధారించుకుని ఈ-కేవైసీ పూర్తి అయితే వెంటనే విచారణ లేకుండా సర్టిఫికేట్‌ను జారీ చేయాలి. ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉంటే గ్రామ వార్డు, సచివాలయాల్లో దానిని పూర్తి చేసి సర్టిఫికేట్ అందించాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల కోసం ప్రస్తుత విధానంలోనే సర్టిఫికేట్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.