YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?

Ycp Protest, Dsc Sports Quota

Ycp Protest, Dsc Sports Quota

YCP Protest on AP DSC Sports Quota Row: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం కొనసాగుతోంది. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు విజయవాడలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు శాప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు శాప్ ప్రధాన కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటితో శాప్ కార్యాలయానికి వస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైసీపీ స్పష్టం చేసింది. ముఖ్యంగా నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొంది. నిరసనలో భాగంగా విజయవాడలోని శిఖామణి సెంటర్ నుంచి శాప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. అయితే ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నగరంలో 30, 163 యాక్ట్ అమల్లో ఉందని పేర్కొంటూ.. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదిలా ఉండగ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కూడా తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఆదివారం విజయవాడలో సుమారు 370 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి తమ నియామకాలను సమర్థించారు. తమ క్రీడా ప్రతిభ, అర్హతల ఆధారంగానే ఉద్యోగాలు పొందామని వారు స్పష్టం చేశారు. తమను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ఆరోపణలు చేయవద్దని.. తమ సర్టిఫికెట్లు, క్రీడా రికార్డులను పరిశీలించవచ్చని టీచర్లు పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను వారు ఖండిస్తూ.. తమ నియామకాలు నిబంధనల ప్రకారమే జరిగాయని చెబుతున్నారు. వైసీపీ ర్యాలీ నిర్వహిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కూడా పోటీగా ర్యాలీ చేపట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఒకవైపు వైసీపీ ఆందోళనకు సిద్ధమవుతుండగా.. మరోవైపు తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ స్పోర్ట్స్ కోటా టీచర్లు కూడా కార్యక్రమం చేపట్టే అవకాశం ఉండటంతో విజయవాడలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.