NTV Telugu Site icon

Pawan Kalyan: నీరు దొరకనప్పుడే.. నీటి విలువ తెలుస్తుంది: డిప్యుటీ సీఎం

Pawan Kalyan

Pawan Kalyan

నీరు దొరకనప్పుడే నీటి విలువ తెలుస్తుందని డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భీష్మ ఏకాదశి రోజున నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో.. నీరు దొరక్కపోతే అలా ఉంటుందన్నారు. జలజీవన్ మిషన్ ప్రధాని నరేంద్ర మోడీ కల అని, ప్రతీ ఇంటికి ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలన్నదే లక్ష్యం అని తెలిపారు. జనవరి నెలాఖరుకు పూర్తి డీపీఆర్‌తో కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తున్నాం అని డిప్యుటీ సీఎం చెప్పారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ పథకం జలజీవన్ మిషన్ వర్క్ షాప్‌ను డిప్యుటీ సీఎం పవన్ ప్రారంబించారు. ఈ వర్క్ షాప్‌లో 26 జిల్లాల సీనియర్ ఇంజనీర్లు, డీఆర్ఈలు పాల్గొన్నారు. 26 జిల్లాలలోని నీటిపారుదల సదుపాయాలు, వినియోగకరమైన నీటి వనరులపై సమీక్ష జరిగింది.

డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘జలజీవన్ మిషన్ ప్రధాని మోడీ కల. ప్రతీ ఇంటికి ప్రతీరోజు 20 లీటర్ల నీరు ఇవ్వాలనేదే ఈ మిషన్ ఉద్దేశం. ప్రజలకు కూడా నీటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలన్నది మా ఉద్దేశం. నీటి వినియోగంలో ఐటీ వినియోగం కూడా భాగం. అమృతధార అనే పేరుతో ఇది మనం చేస్తున్నాం. నీరు దొరకనప్పుడే నీటి విలువ తెలుస్తుంది. భీష్మ ఏకాదశి రోజున నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో.. నీరు దొరక్కపోతే అలా ఉంటుంది. కేంద్రం రిజర్వాయర్ల నుంచి నీటిని ఇవ్వాలని అంటే.. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం చేసింది. 38 రిజర్వాయర్లు ఉన్నాయి మనకు, వాటి నుంచి సరఫరా ఉండాలి. బోర్ పాయింట్ల పేరుతో గత ప్రభుత్వంలో 4వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి’ అని అన్నారు.

జనవరి నెలాఖరుకు పూర్తి డీపీఆర్‌తో కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తున్నాం. జలజీవన్ మిషన్లో బోర్ వెల్స్ ను వాడటం‌వల్ల ఉపయోగం లేకుండా పోయింది. జిల్లాల వారీగా జలజీవన్ మిషన్ అమలులోని ఇబ్బందులను తెలుసుకోవాలనే ఈ వర్క్ షాప్ నిర్వహించాం. మానవతా దృక్పధంతో జలజీవన్ మిషన్ అమలు కావాలి. ఈ మిషన్లో పైప్ లైన్ డిజైనింగ్లో లోపాలున్నాయి. నీళ్ళొస్తుంటే మధ్యలో మోటార్లు వేసి లాగేయకుండా చూడాలి. డబ్బులు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడం లేదు. అవసరమైన చోట టెక్నాలజీని చేర్చడం జరుగుతుంది. ఫిల్టర్ బెడ్లను కూడా చాలా చోట్ల మార్చలేదు. క్షేత్రస్ధాయిలో సలహాలు, సూచనలు అధికారులు ఇవ్వాలి. ఇవాళ సాయంత్రానికి ఈ జలజీవన్ మిషన్కు ఒక స్ధిరమైన సాధన సహకారాలు కావాలి’ అని డిప్యుటీ సీఎం పవన్ పేర్కొన్నారు.