ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. కాకినాడ పోర్టు వ్యవహారం సహా ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి.. భారీ ఎత్తున జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు మీడియా ముందు అసహనం వ్యక్తం చేయడం తీవ్ర సంచలనంగా మారింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నేతల ప్రమేయం కూడా ఉందని, పెద్దపెద్ద వ్యక్తులు దీని వెనుక ఉన్నారని వార్తలు రావడంతో.. సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేబినెట్ భేటీకి ముందురోజు జరుగుతున్న ఈ సమావేశంపై అందరి దృష్టి ఉంది.
కేబినెట్ మీటింగ్ ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 4న ఈ భేటీ జరగాలి. అయితే ఒక రోజు ముందే మంగళవారం జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరుగుతుంది.