గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేనిదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 1.57 లక్షల ప్రజల ప్రాణాలను జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) ఇప్పటిదాకా కాపాడిందన్నారు. వసుధైక కుటుంబకం అని ప్రధాని మోడీ చెప్పినట్టుగా 19,365 మూగజీవాలని కాపాడిందని ప్రశంసించారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు గణనీయం పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి సైతం భారత దేశాన్ని కాపాడాల్సి ఉందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.
విజయవాడకు సమీపంలోని కొండపావులూరులో 20వ ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘1.57 లక్షల ప్రజల ప్రాణాలను ఎన్డీఆర్‌ఎఫ్ ఇప్పటిదాకా కాపాడింది. 7,465 మృతుల దేహాలను వారి కుంటబాలకు చేర్చింది. వసుధైక కుటుంబకం అని ప్రధాని చెప్పినట్టుగా 19,365 మూగజీవాలని ఎన్డీఆర్‌ఎఫ్ కాపాడింది. ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు గణనీయం. ప్రకృతి విపత్తుల నుంచీ సైతం భారత దేశాన్ని కాపాడాల్సి ఉంది. విపత్తుకు స్పందించడమే విపత్తు నిర్వహణ కాదు.. విపత్తు జరిగిన ప్రదేశాన్ని తిరిగి యదాస్ధితికి తేవడం. ఎన్డీఆర్‌ఎఫ్‌కు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు నా కృతజ్ఞతలు’ అని అన్నారు.
‘2018లో భూమి ఇస్తే.. 2024లో ఇక్కడ ఎన్డీఆర్‌ఎఫ్ ప్రారంభించింది. మానవులు చేసిన విపత్తులు కూడా ఉంటాయి. గత ప్రభుత్వం 2024లో వచ్చి ఉంటే.. ఆ పరిస్ధితి దారుణంగా ఉండేది. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా గత ప్రభుత్వ విపత్తు నుంచి కాపాడుకోగలిగాం. స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర సహకారానికి కృతజ్ఞులం. గత ఆరు నెలలుగా ఏపీకి అమిత్ షా సహకారం మరువలేనిది’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.