Pawan Kalyan: పిఠాపురం మహారాజా వారసులకు చెందిన ఆస్తుల కబ్జాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే విచారణ చేయాలని కలెక్టర్, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. వివాదంలో ఉన్న ఇంటికి వెళ్లి ఆర్డీవో కిషోర్ విచారణ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని.. ఈ ఆస్తికి సంబంధించి వివాదం కోర్టు పరిధిలో ఉందని.. ప్రస్తుతం ఉన్న జడ్జిమెంట్ ప్రకారం ఈ ప్రాపర్టీ చంద్రలేఖ కుటుంబానికి చెందినదని.. శాఖా పరంగా విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఆస్తి తమదని చెప్తే సరిపోదు దానికి తగ్గట్లుగా డాక్యుమెంట్స్ ఉండాలన్నారు. ఫైనల్ జడ్జిమెంట్ ప్రకారం ఆస్తి ఎవరిదైతే వారికే చెందుతుందనన్న ఆర్టీవో కిషోర్ స్పష్టం చేశారు.
Read Also: AP Government: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఈ ఇంట్లో 50 ఏళ్లుగా ఉంటున్నామని పిఠాపురం మహరాజా కుటుంబ సభ్యులు వెల్లడించారు. మాపై దాడి చేసి కొట్టి బయటికి పంపించేశారని.. సామానులు బయటకు విసిరేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మా పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామన్నారని చెప్పుకొచ్చారు. ఆస్తి తనదని చెబుతున్న లక్ష్మి డాక్యుమెంట్స్ తీసుకుని వస్తే ఇల్లు వదిలేస్తామని వారు వెల్లడించారు. ఆమె టీడీపీలో యాక్టివ్‌గా తిరుగుతుందని.. వారసత్వ హక్కుగా వచ్చిన ఆస్తి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అధికారులు ఎంక్వయిరీ చేసి ఎవరిది అయితే వారికి ఈ ఇంటిని అప్పగించాలని కోరారు.
“ఐదున్నర శతాబ్ధాలుగా ఇదే ఇంటిలో ఉంటున్నాం. కోర్టు డిక్రీ ద్వారా మాకు ఇది దాఖలు పడింది. ఇప్పుడు మేము ఉంటున్న ఇంటిని తాము కొన్నామంటూ కొందరు వ్యక్తులు వచ్చి ఖాళీ చేయమని బెదిరించడంతోపాటు దౌర్జన్యం చేశారు. వీరి వెనుక కొందరు నాయకులు ఉన్నారు. పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాకు న్యాయం చేయాలి. లేకుంటే చావే శరణ్యం’ అంటూ పిఠాపురం మహారాజా మేనకోడలు, ఆమె కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరు పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి మంగళవారం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోని డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు.
పిఠాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగాగల వీధిలో మహారాజా మేనకోడలు విన్నపాల చంద్రలేఖ(78), తన ఇద్దరు కుమారులు రంగారావు, మాధవరావుతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరు 1970 నుంచి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. దీనిపై వివాదం ఏర్పడగా 1974లో కోర్టు ద్వారా డిక్రీ పొందారు. రెండు నెలల క్రితం ఈ ఇంటిని తాము కొనుగోలు చేశామంటూ జిగటాల లక్ష్మి అనే మహిళతోపాటు కొందరు వ్యక్తులు వచ్చి చెప్పి ఖాళీ చేయాలని డిమాండ్ చేశారన్నారు. ఇది తమ ఇల్లు అని, మీకు ఎవరు అమ్మారని ప్రశ్నించగా వినకుండా తమపై రెండు, మూడు సార్లు వచ్చి దౌర్జన్యం చేయడంతోపాటు తమను ఇంటి నుంచి బయటకు లాగి మెడలో గొలుసు లాక్కుని పోయారని చంద్రలేఖ, కుమారులు తెలిపారు. వీరికి కొందరు నేతలు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కోరుతూ మహారాజా మేనకోడలు విన్నపాల చంద్రలేఖ, కుమారుడు మాధవరావు వీడియో ద్వారా కోరారు.