కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయని, ఏపీలో కూడా ‘స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి కోసం కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ‘పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం అందరి బాధ్యత. కరోనా మహమ్మారి వంటి పరిస్థితుల్లో శుభ్రత గురించి తెలుస్తోంది. ఒక్కరిద్దరే కాదు అందరూ బాధ్యతగా పరిశుభ్రత పాటించాలి. కొన్ని దేశాలు వ్యర్ధాలతో అద్భుతాలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలి. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి సాధించాలని కృషి చేస్తున్నాం’ అని డిప్యూటీ సీఎం తెలిపారు.
Also Read: Polavaram Project: డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం!
‘ఏ కార్యక్రమం అయినా రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలి. మన చిన్నతనం నుండి వ్యర్ధాలను ఇంటి పెరటిలో, మొక్కలకు వేసే సంస్కృతి ఉంది. ఇప్పుడు అది పూర్తిగా దూరమయింది. మరలా ఆ సంస్కృతిని తీసుకురావాలి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తాం. మురికి కూపాలను శుభ్రం చేయటం చిన్న పని కాదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టు విధానంలో పని చేసే వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.