AP Deputy CM Narayana Swamy challenge Nara Lokesh Over Land: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సెటైర్లు వేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్.. రెడ్ బుక్ రాస్తున్నాడంట అని ఎద్దేవా చేశారు. తాను 200 ఎకరాలు భూమిని కబ్జా చేశానని లోకేష్ అంటున్నాడని, ఎక్కడ ఉందో చెప్పి నిరూపించాలని సవాల్ విసిరారు. తనపై లేనిపోని విమర్శలు చేస్తే వంశమే ఉండదని నారాయణ స్వామి అన్నారు. తిరుపతిలో ‘మిచాంగ్’ తుపాను పరిస్థితులను నేడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పరిశీలించారు.
‘నేను కాంగ్రెస్ వాదిని. ఇప్పటికీ దళితులు కాంగ్రెస్ పార్టీతోనే జీవనం సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కులాలను, మతాలను కేసీఆర్ రెచ్చగొట్టారు. అందులకే హైదరాబాద్ సిటీలో ఒక్క సీటు కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. తెలంగాణలో బీజేపీతో కలుస్తాడు.. ఏపీలో టీడీపీతో కలుస్తాడు. ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితి వస్తుంది’ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
Also Read: Cyclone Michaung: మిచాంగ్ తుఫాన్ బీభత్సం.. గత 24 గంటల్లో 181.5 మిమీ వర్షపాతం!
‘200 ఎకరాలు భూమిని కబ్జా చేశాడని నారా లోకేష్ నన్ను విమర్శిస్తున్నాడు. ఆ 200 ఎకరాలు ఎక్కడ ఉందో చెప్పి.. నిరూపించాలి. నిరూపిస్తే ఆ భూమిని వాళ్లకే ఇచ్చేస్తాను. నాపై విమర్శలు చేస్తే వంశమే ఉండదు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్.. రెడ్ బుక్ రాస్తున్నాడంట. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది’ అని నారాయణ స్వామి సెటైర్లు వేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ తన చేతిలో ఒక ఎరుపు రంగు అట్ట కలిగిన పుస్తకంను పట్టుకుని తిరిగిన విషయం తెలిసిందే. తన పాదయాత్రను అడ్డుకోవడం ద్వారా సీఎం జగన్‌పై అభిమానం నిరూపించుకోవాలని కొందరు అధికారులు విపరీతంగా ఆరాటపడుతున్నారని, ఆ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని, ఆ అధికారులను జవాబుదారీగా ఉంచేందుకు బాధ్యుల పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు.