AP Seat Sharing Talks: ఎన్నికల షెడ్యూల్ వచ్చినా.. సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైనట్లు సమాచారం. జనసేన పార్టీకి నాలుగు కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, తిరుపతి కార్పొరేషన్ విషయంలో మాత్రం మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది.
కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు కార్పొరేషన్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మరో కార్పొరేషన్గా తిరుపతిని కూడా తమకు కేటాయించాలని జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తిరుపతి కార్పొరేషన్ తమకే కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో తిరుపతి స్థానంపై ఉత్కంఠ నెలకొంది.
ఈ అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు కొనసాగుతున్నాయి. మూడు పార్టీల నేతలు తిరుపతి కార్పొరేషన్పైనే ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మిగిలిన స్థానాలపై సర్దుబాటు దాదాపు పూర్తయిన నేపథ్యంలో తిరుపతి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ రాత్రికల్లా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియకు తుది రూపు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుపతి కార్పొరేషన్ ఎవరికి దక్కుతుందనే అంశంతో పాటు, జనసేనకు కేటాయించే స్థానాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

