NTV Telugu Site icon

Andhra Pradesh: తమ అనుమతి లేకుండా జీపీఎస్‌ జీవో, గెజిట్‌ విడుదలపై సీఎంవో ఆరా

Ap Govt

Ap Govt

Andhra Pradesh: తమ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ విషయంపై విచారణ చేపడుతోంది. ఆర్థిక శాఖ, న్యాయ శాఖల్లో పని చేసే వాళ్లల్లో ఎవరు దీనికి కారకులనే దానిపై సీఎంవో ఆరా తీస్తోంది. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి, న్యాయ శాఖలోని సెక్షన్ ఆఫీసర్ హరి ప్రసాద్ రెడ్డి పాత్రపై వివరాల సేకరణ జరుగుతోంది. ఇద్దరు అధికారుల గత చరిత్రను ఉన్నతాధికారులు తవ్వి తీస్తున్నారు. అధికారులిద్దరూ బిజినెస్ రూల్స్ పాటించారా..? లేదా..? అనే కోణంలో సీఎంవో విచారణ చేపట్టింది.

బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. చివరి ఆరు నెలల్లో పాత ప్రభుత్వంలో అమలు కాని నిర్ణయాల ఫైళ్లను కొత్త ప్రభుత్వం ముందు ఉంచాలని నిబంధనలు సూచిస్తున్నాయి. అమల్లో లేని పాత ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ తప్పనిసరని బిజినెస్ రూల్సులో ఉందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జీవో జారీ చేయడం.. సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ అప్లోడ్ చేయడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ శాఖల్లో, మంత్రులు, అధికారుల పేషీల్లో ఇంకా ఎవరైనా కోవర్టులున్నారా అనే కోణంలో ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నారు.

Read Also: Minister Satyakumar: ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన ఏపీ మంత్రి సత్యకుమార్

ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) స్థానంలో జీపీఎస్ పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి జీవో నంబర్ 54ను జూన్ 12న విడుదల చేశారు. సరిగ్గా అదే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. అయితే జీవో విడుదలైన తర్వాత జులై 12వ తేదీన గెజిట్‌లో అప్ లోడ్ చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే జీపీఎస్ జీవో, గెజిట్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జీపీఎస్ విధానంపై గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే రీతిలో గెజిట్ విడుదలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చింది అనే అంశంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఎంవో విచారణ చేపట్టింది.