NTV Telugu Site icon

CM YS Jagan: జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తాం.. దానిపైనే మొదటి సంతకం!

Cm Jagan

Cm Jagan

CM YS Jagan: ఏపీలో ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని సీఎం అన్నారు. మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు తిరుగుతున్న ఎన్నికలు కాదని.. అందరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అంటూ ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలని ఆయన వెల్లడించారు. జగన్‌ను ఓడించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని.. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతున్నాయన్నారు. ఒక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్నవారికి..ఇంగ్లీష్ మీడియంతో పాటు నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చిన మనకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

Read Also: YSRCP: వైసీపీకి షాక్.. పార్టీకి ఆమంచి కృష్ణమోహన్ గుడ్‌బై

పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సమతుల్యం దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించారని సీఎం జగన్ మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించామని.. వీరిని విస్మరించిన వారికి, ఆదరించిన వారికి మధ్య ఎన్నికల జరుగుతున్నాయన్నారు. ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అర్హులకు లబ్ధిని చేకూర్చామని సీఎం తెలిపారు. పెన్షన్లను ఇంటికే వచ్చి ఇచ్చామన్నారు. ఇప్పుడు యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తున్నామన్నారు. ప్రతి నెల ఒకటిన వాలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి అవ్వా తాతలకు పెన్షన్లను 58 నెలలగా ఇచ్చామని.. ఎన్నికలు రావడంతో జీర్ణించుకోలేక అసూయతో చంద్రబాబు తనకు సంబంధించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారని ముఖ్యమంత్రి చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు 1000 రూపాయలుగా ఉన్న పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచామన్నారు. అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు సీఎం జగన్.

Read Also: Andhra Pradesh: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం

పేదల భవిష్యత్తు కోసం పోరాడేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయని.. చెడిపోయాయని.. అవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్‌ను ఆపించారని మండిపడ్డారు. టీడీపీ నేత ఆదిరెడ్డి వాసునే ఈ విషయాన్ని చెప్పారన్నారు. ఇలాంటి దుర్మార్గం వల్లే 31 మంది అవ్వ తాతలు నడవలేక అవస్థలు పడలేక ప్రాణాలు విడిచారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోనే ఇంతమంది మరణించడం బాధాకరమన్నారు. 31 మంది మరణానికి కారణమైన చంద్రబాబును హంతకుడిని అందామా అంటూ ప్రశ్నించారు. రెండు నెలలు ఓపిక పట్టాలని.. జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ఇంటింటికి సేవలు అందించే కార్యక్రమంపైన మొదటి సంతకం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. చంద్రబాబు హయంలో జన్మభూమి కమిటీలు ఏ విధంగా పని చేశాయో అందరూ చూశారని.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పని చేసిందో ప్రజలు చూశారన్నారు. దీన్ని చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

 

Show comments