CM YS Jagan: విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు తొలిదశలో పూర్తైన స్కూళ్ల నిర్వహణను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక ధ్యాసపెట్టి, వారు మెరుగ్గా తయారవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది 8వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21 నుంచి ట్యాబులు పంపిణీ చేయాలని.. అన్ని ల్యాప్‌టాపుల్లో పిల్లల సందేహాలను తీర్చే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు. గత ఏడాది ట్యాబులు పొందిన టీచర్లు సగటున ప్రతి రోజూ 77 నిమిషాలు వినియోగిస్తున్నట్టు సర్వేలో తేలింది.
Read Also: AP Congress: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన కాంగ్రెస్ ప్రతినిధుల బృందం
గత ఏడాది ట్యాబులు అందుకున్న విద్యార్థులు సగటున 67 నిమిషాలు ట్యాబులను పాఠ్యాంశాలను నేర్చుకునేందుకు వినియోగిస్తున్నట్టు పరిశీలనలో తెలిసింది. డ్యామేజ్ అయిన దాదాపు 7 వేల ట్యాబులను రీప్లేస్ మెంట్ చేశారని అధికారులు తెలిపారు. డిసెంబరు మూడోవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఐఎఫ్‌పీ ప్యానెళ్ల ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయంపై చర్యలు తీసుకోవాలని సీఎం సూచనలు చేశారు. నాడు– నేడు రెండో దశ పనులను సీఎం సమీక్షించారు. రెండో దశలో నాడు– నేడు కింద రూ. 3,746.82 కోట్ల విలువైన పనులు చేయనున్నారు. నాడు –నేడు పనుల్లో భాగంగా 11 రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. జూనియర్ కాలేజీల్లోనూ నాడు – నేడు పనులు జరగనున్నాయి. దేశం మొత్తం మీద సగటున 37.03 శాతం మంది మాత్రమే ఇంగ్లీషు మాధ్యమంలో పరీక్షలు రాస్తుండగా.. ఏపీలో 84.11 శాతం మంది పరీక్షలు ఇంగ్లీషులోనే రాస్తుండడం గమనార్హం.
Read Also: Perni Nani: కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్
టోఫెల్ శిక్షణపై ముఖ్యమంత్రికి వివరాలు అందించిన అధికారులు
సీఎం ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఒక పీరియడ్ టోఫెల్‌పై శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఐబీ సిలబస్‌పై తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. ఇప్పటికే వర్కింగ్ గ్రూపు సమావేశాలకు అధికారులు హాజరయ్యారని వెల్లడించారు. ఫేజ్ –1లో భాగంగా పాఠ్యప్రణాళిక, అసెస్మెంట్, టీచర్ ట్రైనింగ్, ఇక్కడ అవసరాలను దష్టిలో పెట్టుకుని బోధన ప్రణాళిక, తదితర అంశాలపై అధ్యయనం జరుగుతుందని తెలిపారు. ఐబీ నుంచి వచ్చే స్పెషలిస్టులు అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది ఐబీ బోధనపై టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 6వ తరగతి ఆ పైబడ్డ తరగతులకు ప్యూచర్ స్కిల్స్‌పై పాఠ్యాంశాల బోధన ఉండనుంది. పిల్లలకు ఫ్యూచర్ స్కిల్స్‌లో ట్రైనింగ్ కోసం ఇంజినీరింగ్ కాలేజీలలో నైపుణ్యం ఉన్నవారి సేవలను ప్రభుత్వం వినియోగించుకోనుంది. దీనికిగానూ వీరికి స్టైఫండ్ ప్రభుత్వం చెల్లించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆప్షన్ ఎంచుకున్న విద్యార్ధులకు జపనీస్, జర్మన్ లాంటి ఇతర విదేశీ భాషలను కూడా నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. 9, 10వ తరగతి విద్యార్థులు అదనపు ఆప్షన్‌గా జర్మన్, జపనీస్, ఫ్రెంచి, స్పానిష్ లాంటి భాషలను నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. దీనివల్ల మరిన్ని విస్తారమైన అవకాశాలు పిల్లలకు లభిస్తాయని అధికారులు తెలిపారు. పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా యాప్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు అధికారులు.
Read Also: Ministe RK Roja: ఇంత బడ్జెట్‌తో ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ క్రీడలు నిర్వహించలేదు..
విద్యాకానుకపైనా సీఎం సమీక్ష
మళ్లీ స్కూళ్లు తెరిచేలోగా విద్యాకానుక పంపిణీకి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. డ్రాప్ అవుట్స్‌పై స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాన్ని ఇచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. పదోతరగతి ఫెయిల్ అయిన వారి సహా 1,49,515 మంది తిరిగి బడుల్లో చేరారని వెల్లడించారు. పిల్లలను తిరిగి బడులకు పంపే ప్రక్రియలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని అధికారులు పేర్కొన్నారు. దేశంలో నూటికి నూరుశాతం పిల్లలను బడికి పంపడంలో తొలి జిల్లాగా నంద్యాల రికార్డు సృష్టించిందని అధికారులు వెల్లడించారు.