Tirumala Brahmotsavam 2023: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు సమర్పించేందుకు బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి బయల్దేరిన సీఎం జగన్.. ఆలయంలోకి రాగానే పరివట్టం కట్టారు ఆలయ ప్రధాన అర్చకులు. పట్టువస్త్రాలు సమర్పించాక అర్చకులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ 2024 కేలండర్, డైరీ ఆవిష్కరించారు సీఎం జగన్. పెదశేష వాహనంలో పాల్గొన్న తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఇక, గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. నిన్న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఇవాళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలను సమర్పించారు.. తిరుమల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను కనులార తిలకించేందుకు తరలి వచ్చిన భక్తులతో కిక్కిరిపోయింది. శ్రీవారికి పెద్ద శేషవాహన సేవ జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.. మరోవైపు.. బ్రహ్మోత్సవాల్లో రోజూ లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని అంచనా. దీంతో లక్ష మందికి అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు జరిగే గరుడ సేవకు రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని TTD అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ స్వామివారి అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది TTD. ఈ నెల 26న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.