Jagananna Amma Vodi: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు.. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్న ఆయన అమ్మ ఒడి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. ఇక, కురుపాం పర్యటన కోసం ఈ రోజు ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కాలేజ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తారు.. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేస్తారు.. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు..
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిస్తే.. ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరుతారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు 8.20 గంటలకు చేరుకుంటారు. 8.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో 9.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఉదయం 9.25 గంటలకు బయలుదేరి 10 గంటలకు కురుపాం నియోజకవర్గం చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.05 గంటకు బయలుదేరి రోడ్డు మార్గంలో 10.30 గంటలకు కురుపాంలోని సభాస్థలం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు. 10.35 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి నిధులను బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.. అనంతరం బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.. 12.25కు హెలీప్యాడ్ వద్దకు చేరుకుని 12.55 వరకు స్థానిక నాయకులతో సమావేశం అవుతారు. ఒంటి గంటకు హెలికాప్టర్‌లో తిరిగి విశాఖపట్నం చేరుకుంటారు.
కాగా, తమ పిల్లలను స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివిస్తోన్న తల్లుల ఖాతాల్లో జూన్ 28న అమ్మఒడి నగదును జమ చేయనుంది ఏపీ సర్కార్.. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లి/సంరక్షకుడు ఏటా రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది ప్రభుత్వం.. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేల నుంచి స్కూల్, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2వేలు మినహాయిస్తున్నారు. మిగతా రూ.13వేలు మాత్రమే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారులకు ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు, లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. స్కూల్ ఐడీ కార్డు.. ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులైన విషయం విదితమే..