Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తుఫాన్ , కరువులపై పరిశీలన చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాలు భేటీ అయ్యాయి. సీఎంతో తుఫాన్, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు అధికారుల బృందాలు సమావేశమై.. క్షేత్ర స్థాయిలో తాము గుర్తించిన అంశాలపై చర్చించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించామంటూ తాము చూసిన పరిస్థితులను కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించ గలిగారని కేంద్ర బృందం తెలిపింది. సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని ఆ బృందాలు పేర్కొన్నాయి. .విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్ర స్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని వెల్లడించింది. ఇ-క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని తెలిపింది.
ఇవి ఇతర రాష్ట్రాలూ అనుసరించ దగ్గవని, ఆయా ప్రభుత్వాలకు తెలియజేస్తామని కేంద్ర బృందం తెలిపింది. తుఫాను వల్ల జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఈ సమావేశంలో కేంద్ర కమిటీ చర్చించింది. తాము పరిశీలించిన అంశాలను కేంద్ర బృందం అధికారులు వివరించారు. మొత్తంగా ఏడు జిల్లాల్లో తిరిగామని.. మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులపై పరిశీలన చేశామని కేంద్ర బృందం తెలిపింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించామని సభ్యులు తెలిపారు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామనీ, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామని వారు వివరించారు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశువులు, తాగునీరు తదితర అంశాలపై చర్చించారు. జలవనరులు పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూశామని వెల్లడించారు. ఉపాధిహామీ పథకంపైనా పరిశీలన చేశామని ఆ బృందం తెలిపింది. ఆర్బీకేలు, ఉచిత పంటల భీమా, డీబీటీ పథకాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, కంటిజెన్సీ కింద విత్తనాలు పంపిణీ, మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు, గ్రామ సచివాలయాల వ్యవస్థలను పరిశీలించారు. ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని వారు వెల్లడించారు. కౌలు రైతులకు ఎక్కడా లేని విధంగా రైతు భరోసా అందించడం అభినందనీయమని కేంద్ర బృందం పేర్కొంది.
Read Also: Minister Ambati Rambabu: పవన్‌కు తన పార్టీపై తనకే స్పష్టత లేదు..
వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా రైతుల్లో అవగాహన కల్పించాలని.. పెసలు, మినుములు, మిల్లెట్స్ లాంటి ఇతర పంటల వైపు మళ్లేలా చూడాలని కేంద్ర బృందం సూచించింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పని దినాల పైనా కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు వివరాలు తెలిపారు. పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం పనుల బిల్లులు వెంటనే వచ్చేలా చూడాలని రాష్ట్ర అధికారులు కోరారు. తుఫాను కారణంగా రంగు మారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని అధికారులు కోరారు.
కేంద్ర బృందంతో సీఎం వైయస్.జగన్..
తుపాను బాధిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను వివరించిన సీఎం జగన్ కేంద్ర బృందానికి వివరించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించమే కాకుండా వారికి తక్షణ సహాయాలను కూడా అందించామని సీఎం తెలిపారు. తుఫాన్ ఏదో ఒక ఒక ప్రాంతంలో సహజంగా తీరం దాటుతుందని, కానీ ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైందని సీఎం వివరించారు. దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయని సీఎం వెల్లడించారు. .ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుఫాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోందని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలో ఇ- క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉందని, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతామని సీఎం వివరించారు. ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా రైతులకు చేరుతుందని సీఎం జగన్ వివరించారు. . క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆమేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని సీఎం కేంద్ర బృందాన్ని కోరారు.