CM YS Jagan: శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు.. సంతబొమ్మాళి మండలం మూలపేటకు వెళ్లనున్న ఆయన.. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు.. దీనికోసం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. విశాఖపట్నం నుండి చాపర్ లో శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు.. ఉదయం 10.15 గంటలకు మూలపేట చేరుకోనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 10.30 – 10.47 గంటల మధ్య మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు.. అనంతరం బీచ్ లో గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు ఉంటాయి.. ఉదయం 11.35 గంటలకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేయనున్నారు.. దీంతోపాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. ఉదయం 11.40 – మధ్యాహ్నం 12.30 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి, భూములు ఇచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
ఇక, సీఎం జగన్ తన పర్యటనలో శ్రీకారం చుట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే.. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేస్తారు.. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.. మరోవైపు.. విష్ణుచక్రం, మూలపేటకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని నిర్మించబోతోంది.. ఇక, మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఏపీతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనావేస్తున్నారు.
ఇవాళ్టి తన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్.. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు.. మూలపేట పోర్టు విషయానికి వస్తే.. పోర్టు సామర్థ్యం ఏడాదికి 23.5 మిలియన్ టన్నులు, బెర్తుల సంఖ్య 4గా ఉండగా.. ఎన్‌హెచ్ 16ను అనుసంధానం చేస్తూ 13.8 కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారి, నౌపడ జంక్షన్ నుంచి పోర్టు దాకా 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం, గొట్టా బ్యారేజ్ నుంచి 50 కిలోమీటర్ల పైప్‌లైన్‌తో 0.5 ఎంఎల్‌డీ నీటి సరఫరా.. పోర్టుకు అనుబంధంగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఇలా ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోనుంది.