Site icon NTV Telugu

CM Chandrababu: అదే నా ఆశ.. ఆకాంక్ష!

Chandrababu

Chandrababu

నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలన్నదే తన ఆశ, ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది.

‘తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యం. ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పం. అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

Also Read: Godavari River Tragedy: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు.. ఒక మృతదేహం లభ్యం!

‘తెలుగుదేశం పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచింది. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడును తొలిసారి కడపలో నిర్వహించ తలపెట్టాం. మహానాడు సందర్భంగా ప్రజా సేవకు పునరంకితమవుతూ ‘యువగళం’కు ప్రాధాన్యతనివ్వాలని, ‘అన్నదాతకు అండగా’ నిలవాలని, ‘స్త్రీ శక్తి’కి పెద్దపీట వేయాలని, ‘పేదల సేవలో’ నిరంతరం శ్రమించాలని, ‘తెలుగు జాతి విశ్వఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని, ‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి. అదే నా ఆశ.. ఆకాంక్ష’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Exit mobile version