ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదల అంశంపై చర్చ జరగనుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయం కోరనున్నారు.
హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ఆర్థిక సాయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో మిర్చి రైతుల సమస్యలపై చర్చ జరగనుంది. ఇటీవల మిర్చి ధర భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. సీఎం కేంద్రం సాయం కోరనున్నట్లు తెలుస్తోంది.
గురువారం సాయంత్రం ప్రధాని మోడీ, ఎన్డీయే నేతల సమక్షంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు ఎన్డీయే నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. ఇక రాత్రి తిరిగి అమరావతికి సీఎం చేరుకోనున్నారు.