NTV Telugu Site icon

CM Chandrababu: హార్డ్‌ వర్క్‌ ముఖ్యం కాదు.. స్మార్ట్‌ వర్క్‌ కావాలి: సీఎం

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

హార్డ్‌ వర్క్‌ ముఖ్యం కాదని, స్మార్ట్‌ వర్క్‌ కావాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సంక్షోభాలనే అవకాశాలుగా మలచుకోవాలన్నారు. ఓటే దేశాన్ని ఇంతవరకూ కాపాడుతూ వస్తోందని, ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో గూగుల్‌ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందని, మంత్రి నారా లోకేశ్‌ కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

‘ఓటే ఈ దేశాన్ని ఇంతవరకూ కాపాడుతోంది. నియంతలు పుట్టుకొచ్చినపుడు వారిని పంపడానికి ఉద్యమాలు వస్తాయి. ప్రజా చైతన్యమే భారతదేశానికి శ్రీరామరక్ష. గూగుల్ కంపెనీ విశాఖకు రావడానికి ఎంవోయూ చేసింది మనతో. విశాఖపట్నంలో చాలా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. భవిష్యత్తులో చాలా భిన్నమైన మార్పులు వస్తాయి. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, డాటా హబ్ వచ్చి కనెక్ట్ చేస్తే.. విశాఖ ఏఐకి ఒక సెంటర్ అవుతుంది. మన RTGSతో గూగుల్ ఒక ఒప్పందం చేసుకుంది. గూగుల్‌లో శాటిలైట్ ద్వారా గంజాయిని 4,000 ఎకరాల్లో గుర్తించాం. రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందని నేను చెపుతున్నా.. ప్రజలు నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారు. తప్పులు జరక్కుండా చేసే బాధ్యత అధికారుల అందరి మీద ఉందని మీరు నోట్ చేసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

‘గత ప్రభుత్వంలో‌ రాబోయే ఫైనాన్స్ కమీషన్ నిధులు కూడా రాకుండా చేసారు. భూకబ్జాలు వెంటాడుతున్నాయి. ఉచిత ఇసుక అమలు ఒక సవాలులా తయారయింది. గంజాయి, డ్రగ్స్ రాష్ట్రం మొత్తం కనిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లు అత్యధికంగా ఉన్నారు. రేషన్ బియ్యం ఎగుమతి ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది. రేషన్ మాఫియా కూకటివేళ్లతో తీసెయ్యాలి. పోర్టులు, సెజ్ లు కూడా కబ్జాకు గురవుతున్నాయి. ఇవి కచ్చితంగా సరిచేస్తాం. 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. 20 పాలసీలు తీసుకొచ్చాం. విజన్ 2047 తయారు చేశాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు టార్గెట్‌గా నిర్ణయించాం. అమరావతికి ప్రారంభంలో 50 వేల కోట్లు అవసరం అవుతాయి. పోలవరంను 2027కి పూర్తి చేయాలని నిర్ణయించాం. 64 లక్షల మందికి ఇంటికెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం. పేదలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని మా ఉద్దేశం. 40 లక్షల మందికి ఇప్పటి వరకూ దీపం-2 కింద సిలిండర్లు ఇచ్చాం. 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం. 199 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం’ అని సీఎం చెప్పారు.

Show comments