NTV Telugu Site icon

CM Chandrababu: వకుళామాత వంటశాల ప్రారంభం.. తిరుమలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu

Chandrababu

CM Chandrababu: తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోరోజు పర్యటించారు. వకులామాత అన్నప్రసాద వంటశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వంటశాలను పరిశీలించి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. అంతకు ముందు టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.

సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదని…ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పనిచేయాలన్నారు. బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరాలు అడిగారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ప్రశ్నించారు. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్నారు.భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్నారు.

Read Also: TTD: టీటీడీ బోర్డు మెంబర్ గా టాలీవుడ్ నుండి ఎవరు..?

ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారు.. ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి…మరింత మెరుగుపడాలన్నారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి.. అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలన్నారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి…ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. సింపుల్‌గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలన్న ఆయన.. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని చెప్పారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. దేశ విదేశాలనుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదన్నారు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్నారు. తిరుమల పేరు తలిస్తే.. ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలన్నారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలి.. ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం. తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని ముఖ్యమంత్రి సమీక్షలో సూచించారు.

 

Show comments