AP CM Chandrababu: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలను సీఎంకు డిప్యూటీ సీఎం వివరించారు. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు వచ్చేలా పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏమి అవసరమో గుర్తిస్తామని.. సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే జనవరి నుండి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తామని.. గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామని సీఎం వెల్లడించారు.
Read Also: Minister Rama Naidu: వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల సంచలన కామెంట్లు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. 2014-19 మధ్య చేపట్టిన పలు కార్యక్రమాల ద్వారా నాడు గ్రామాల రూపు రేఖలు మార్చామన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను సమస్యలకు కేంద్రాలుగా మార్చిందన్నారు. మళ్లీ గ్రామాల్లో వెలుగు తెచ్చేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీ రాజ్ శాఖకు జవసత్వాలు అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామం నుంచి సమీప ప్రాంతాల అనుసంధానం కోసం రోడ్లు, మార్కెట్ ప్లేస్‌లు వంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. కనీస అవసరాలుగా గుర్తించి అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ సమగ్రమైన ప్రణాళికతో రానున్న రోజుల్లో పని చేయాలని సూచించారు. రాబోయే 5 ఏళ్లలో 17,500 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.