NTV Telugu Site icon

AP CM Chandrababu: లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu

Chandrababu

AP CM Chandrababu: ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పాలకులెవ్వరూ తిరుమల పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదన్నారు. ఎందరికో స్పూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో 5ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని.. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామన్నారు. వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని చంద్రబాబు పేర్కొన్నారు. అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం స్వామి వారు చేసిన అద్భుతమే తప్ప, ఆ బ్లాస్ట్‌లో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమన్నారు. అకౌంట్లు ఎప్పటికప్పుడు స్వామి వారు సెటిల్ చేస్తారు.. ఆయన మహత్యం అది అని సీఎం చెప్పారు. తిరుమల లడ్డూ న్యాణ్యత, సువాసనలో ఎంతో విశిష్టత ఉందన్నారు. స్వామి వారి మహత్యం ఉంది కాబట్టే ఎంతో మంది లడ్డూని కాపీ చేయాలనుకున్నా చేయలేకపోయారన్నారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూకి వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారన్నారు.

Read Also: Pantham Nanaji: కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే పంతం నానాజీ

నాసిరకం వారికి గేట్లు తెరిచినట్లుగా రివర్స్ టెండరింగ్ నిబంధనలు మార్చేశారన్నారు. ఫలితంగా ప్రధాన సంస్థలు ఏవీ టెండర్లో పాల్గొనలేక పోయాయన్నారు. వైసీపీ వచ్చీ రావడంతోనే ఆలయ ప్రతిష్టను దెబ్బ తీసిందన్నారు. ట్రస్టు బోర్డుల నియామకాలు ఓ గ్యాంబ్లింగ్‌గా మార్చేశారన్నారు. ఇష్టానుసారంగా వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్నారని, కొండపై వ్యాపారాలు చేశారన్నారు. అన్య మతస్తులను టీటీడీ ఛైర్మన్‌గా వేశారని.. రాజకీయ కేంద్రంగా టీటీడీని వాడుకున్నారని విమర్శించారు. తిరుమల అన్నదానంలో భోజనం చేస్తేనే ఓ ప్రత్యేక అనుభూతి కలిగేలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. NDDB రిపోర్ట్ ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతింటే, ఎదురుదాడితో తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడటం క్షమించరాని నేరమని ముఖ్యమంత్రి మండిపడ్డారు. NDDB నివేదిక వాస్తవాలు నేను కప్పిపుచ్చి తారుమారు చేసి బయట పెట్టాలని జగన్ కోరుకుంటున్నాడా అంటూ ప్రశ్నించారు. ఎదురుదాడి చేస్తే చేసిన అపచారాన్ని ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా ? ఏంటి మీ ధైర్యం అంటూ ప్రశ్నించారు. NDDB నివేదిక బయట పెట్టకపోతే ప్రజలకు వాస్తవాలు ఎలా తెలుస్తాయన్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాల్సిన లడ్డూ త్వరగా పాడవటం, రంగు మారటం వంటి పరిణామాలు చూశామన్నారు, లడ్డు రుచి చూసిన వారెవ్వరైనా నాణ్యత లేదని ఇట్టే చెప్పేవారన్నారు.

“తిరుమల ప్రక్షాళనకు దేవుడు నాకొక అవకాశం ఇచ్చారని శ్యామలరావుకి చెప్పి, అందుకనుగుణంగా పని చేయాలని చెప్పి ఈవో గా నియమించా. లడ్డూ నాణ్యత పై అనుమానంతోనే 4 ట్యాంకర్లను NDDB పరీక్షలకు పంపాం. ల్యాబులో పరీక్షల తర్వాత ఎస్ వాల్యులులో భారీ వ్యత్యాసాలు వెలుగు చూశాయి. వెంటనే ఈవో సదరు సంస్థలకు నోటీసులు ఇచ్చి, బ్లాక్ లిస్టులో పెట్టడం వంటి చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తించారు. తదుపరి చర్యలకు నిపుణుల కమిటీ కూడా వేసి మళ్లీ టెండర్లు పిలిచారు. అధికారం చేపట్టాక ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకుని ఎన్నో వాస్తవాలు వెలుగు చూశాయి. చేసిన తప్పుని సమర్ధించుకుంటూ ప్రధానికి లేఖ రాయటానికి ఎంత ధైర్యం?. రాజకీయ ముసుగులో వచ్చిన నేరస్థుడు కాబట్టే జగన్ ని ఎస్కోబార్ అన్నాను. ఎంతో అపచారం చేసి సమర్ధించుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారు..?. నిన్నటి నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తుంటే కడుపు రగిలిపోయి ఆవేశం వస్తోంది. టీటీడీ ఛైర్మనుగా చేసిన వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతుంది. మరో మాజీ ఛైర్మన్ భూమన తన ఇంట్లో పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశాడు. ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత. నాకు నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నాకు కర్తవ్యం. భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురు దాడి చేస్తే ఎలా.” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Minister Nadendla Manohar: ఎన్నికల హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తాం..

చంద్రబాబు మాట్లాడుతూ.. “వైసీపీ ప్రభుత్వ హయాంలో 3.75 లక్షల వీఐపీ టిక్కెట్లు ఇచ్చుకున్నారు. తిరుమల విషయంలో జగన్ చేసిన పాపాలు ప్రజలకు ముందే తెలిసి ఉంటే.. ఆ 11కూడా గెలిచేవాడు కాదు. కరుడుగట్టిన నేరస్థుడైన వ్యక్తికి ఉగ్రవాద మనస్తత్వం ఉంటేనే…, చేసిన తప్పుకు క్షమాపణలు కోరక పోగా ఇలా ఎదురు దాడి చేసే ఆలోచనలు వస్తాయ్. రాసే అబద్ధాలకు హద్దే లేదన్నట్లుగా ప్రధానికి లేఖ రాస్తావా?. చేయరాని తప్పులు చేసి నాపై విషం కక్కుతారా ?. నేరం చేసి, ఆ తప్పులు కాయమన్నట్లుగా వ్యవహరిస్తూ ఎటు పోతున్నారో అర్ధం కావట్లేదు. చేసిన తప్పుని ఒప్పని ఇంట్లో కూర్చుని సర్టిఫికెట్‌లు ఇస్తారా ?. ఇంగిత జ్ఞానం ఉన్న వారెవ్వరైనా రూ. 320 నెయ్యి కొనుగోలు చేస్తూ రివర్స్ టెండర్లు తెస్తారా..?. నిబంధనలన్నీ తారుమారు చేసి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారా ?ఇలాంటి వారు రాజకీయాలు చేస్తుంటే.. వారికి సమాధానాలు ఇవ్వాలంటే మాకే సిగ్గుగా ఉంది. స్వామి వారి పవిత్రతను ఎవ్వరూ మలినం చేయలేరు. టీటీడీ పవిత్రత కాపాడటం కూటమి బాధ్యత. మొత్తం ప్రక్షాళన చేసి, పూర్వవైభవం కాపాడుకునేందుకు మనుషులుగా మన వంతు ప్రయత్నాలు చేద్దాం. ఇప్పటికే ఆగస్టు 15న జరిగిన తప్పుకు యాగం చేశారు.” అని ఆయన వ్యాఖ్యానించారు.