NTV Telugu Site icon

CM Chandrababu: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ

Chandrababu

Chandrababu

CM Chandrababu: మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సిఎం ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలని చంద్రబాబు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్ళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలం, నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై సమూహిక అత్యాచార ఘటనలో జరుగుతున్న విచారణపై సమీక్షించారు. ఈ ఘటనలో నిందితులకు తక్షణం శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసును విచారించాలని అన్నారు. దీని కోసం హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి, మహిళలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనితో పాటు గతంలో బాపట్ల జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలని సీఎం అన్నారు.

Read Also: Minister Kollu Ravindra: పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

లైంగిక వేధింపులు, మహిళలపై దాడి వంటి అంశాలపై కఠినంగా వ్యవహరించి త్వరగా న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ విధానం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఘటనకు సంబంధించి ఇప్పటికే పలు కీలక అంశాలను దర్యాప్తు బృందం రాబట్టిందన్నారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు దొంగతనాలకు పాల్పడుతుండటంతో పాటు అత్యాచారాలకు పాల్పడతారన్న అంశం విచారణలో తేలిందన్నారు. నేరగాళ్లను గుర్తించడానికి, కట్టడి చేయడానికి, కఠినంగా శిక్షలు వేయడానికి టెక్నాలజీ ద్వారా సాక్ష్యాలను సేకరించాలని సిఎం అధికారులకు ఆదేశించారు. నేరస్తులను పట్టుకోవడంలో సిసి కెమేరాలు సహా అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక అంశాలను వాడుకోవాలని సూచించారు. నేరస్తులను వెంటనే గుర్తించే వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని సిఎం అన్నారు. ఇప్పటికే ఉన్న సీసీటీవీ కెమెరాలను పూర్తిగా అందుబాటులోకి తేవడంతో పాటు కొత్తవాటిని ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. అదే విధంగా నేరాలను అరికట్టేందుకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని…..ఎక్కడైనా లైంగిక వేధింపులు, ఘర్షణలు, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఆ సమాచారాన్ని, వాటికి తగ్గ ఆధారాలును పోలీసులతో పంచుకోవాలని సీఎం కోరారు.

ప్రజల సహకారంతో నేరాల అడ్డుకట్ట మరింత సమర్థవంతంగా చేయవచ్చని సిఎం అన్నారు. పోలీసులకు సమాచారం పంపిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామనే నమ్మకాన్న కూడా పోలీసు శాఖ కల్పించాలని సిఎం అన్నారు. ఈ విషయంలో అపోహలు తొలగించి ప్రజల సహకారం తీసుకోవాలని సిఎం సూచించారు. ప్రజల ప్రాణాలకు, మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళ స్వేచ్ఛగా తిరిగేలా రాష్ట్రంలో శాంతి భద్రతలు కల్పించేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని సిఎం చంద్రబాబు అన్నారు.