Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబుని కలిసేందుకు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలీసులు ఇనుప గ్రిల్స్ తో బార్కేడింగ్ ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్కేడింగ్ చూసి పాత ప్రభుత్వ విధాన హ్యాoగ్ ఓవర్ వీడాలంటూ పోలీసులతో గట్టిగా చెప్పారు. ఇన్నేళ్లు కార్యకర్తల్ని కలుస్తూ వచ్చానని, ఎప్పుడూ లేని వ్యవస్థ ఇప్పుడెందుకు పెట్టారని సీఎం ప్రశ్నించారు. పార్టీ శ్రేణులకు, తనకు అడ్డుగోడలు తెచ్చే చర్యలు ఉపేక్షించనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మీ భద్రతా సాయంతోనే పార్టీ కార్యాలయం నడపలేదనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి అన్నారు.
తనకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు. వినతుల స్వీకరణకు పద్ధతిలో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. సచివాలయంలోనే వినతులు స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నామన్నారు. ప్రజా వినతులు స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దుష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజావేదిక ఉండి ఉంటే వినతులు స్వీకరణకు అనువుగా ఉండేది, కానీ జగన్ ప్రజా వేదికను కూల్చి వేశాడని మండిపడ్డారు. ప్రజా వేదిక గుర్తులు విధ్వంస పాలనకు ప్రతీకగా అలానే ఉంటాయన్నారు. ఆ శిథిలాలను తొలగించమన్నారు. త్వరలోనే క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభిస్తానని.. పోలవరంతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచీ నిర్వహించేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. సచివాలయానికి రాకపోకలు కోసం రవాణా, ఇతరత్రా వెసులుబాటు లన్నీ అందుబాటులోకి తెస్తామన్నారు.