AP CID: గత ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలపై సీఐడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఏపీబీసీఎస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అక్రమాలపై సీఐడీ కూపీ లాగుతోంది. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు.. అక్రమాలు జరిగిన తీరుపై నాటి ఉన్నతాధికారుల నుంచి వివరాలను సీఐడీ తీసుకుంటోంది. వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీబీసీఎల్ ఎండీతో పాటు, డిస్టలరీల కమిషనర్ గానూ వాసుదేవ రెడ్డికే గత ప్రభుత్వం బాధ్యతలు కట్టబెట్టింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్లకు ఫైళ్లు పంపకుండా నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవ రెడ్డికే అధికారాలు ఇచ్చింది.
ట్రాన్సఫర్లు చేయించేస్తానంటూ ఉన్నతాధికారులను బెదిరించారని వాసుదేవరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. మద్యం కొనుగోళ్లలోనూ భారీగా అవకతవకలకు వాసుదేవ రెడ్డి తెరలేపినట్లు తెలిసింది. ఒకే బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధరకు కొనుగోలు చేసినట్టు విచారణలో సీఐడీ గుర్తించింది. ఒక్క వాసుదేవ రెడ్డి అవినీతే లెక్కలకు అందటం లేదని సీఐడీ అంటోంది. బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీల్లోకి వాసుదేవ రెడ్డి చొరబడినట్లు సీఐడీ పేర్కొంటోంది. కొన్ని మద్యం బ్రాండ్లను రాత్రికి రాత్రే తప్పించినట్లు గుర్తించింది.
Read Also: Microsoft Windows outage: గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యం
తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లను గత సర్కారు గణనీయంగా తగ్గించేసినట్లు సీఐడీ గుర్తించింది. 2014-2019 మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లు 32 అందుబాటులో ఉంటే వాటిని రెండు బ్రాండ్లకే కుదించింది. . వాటిని అధిక ధరలకు విక్రయించి గత ప్రభుత్వం సొమ్ము చేసుకున్నట్లు సీఐడీ అధికారులు ఆరోపించారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో పోలిన పేర్లు వచ్చేలా సొంత బ్రాండ్లను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు సీఐడీ ఆరోపించింది. సొంత బ్రాండ్ల మద్యానికి అధిక ధరల ఎమ్మార్పీలను నిర్ధారించినట్లు సీఐడీ తెలిపింది. సబ్ లీజుల పేరుతో డిస్టిలరీలను జగన్ సన్నిహితులు కైవసం చేసుకున్నట్లు.. 11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్టు విచారణలో గుర్తించినట్లు సీఐడీ ఆరోపించింది. హస్తగతం చేసుకున్న డిస్టిలరీల నుంచే 65 శాతం మేర మద్యాన్ని ఏపీలో కొనుగోళ్లకు వాసుదేవరెడ్డి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. 2014-19 మధ్య కాలం లో ఉన్న టాప్ 5 మద్యం బ్రాండ్ మద్యాన్ని 2019 తర్వాత కొనుగోళ్లు నిలిపివేశారని సీఐడీ పేర్కొంది. మద్యం ఆదాయాన్ని ఏపీఎస్డీసీకి రూ. 14,276 కోట్లు మళ్లించినట్టు గుర్తించింది.