AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?

Ap Cabinet

Ap Cabinet

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 24.15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఎన్నికల హామీని అమలు చేయాలంటే రిజర్వేషన్లను దాదాపు 10 శాతం పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికపై కేబినెట్ నిర్ణయం కీలకంగా మారింది.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానానికి సంబంధించిన బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల విధానంలో మార్పులు తీసుకురావడంలో భాగంగా ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొస్తోంది. దీంతో పాటు మరికొన్ని కీలక బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక, మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలు వంటి కీలక అంశాలు నేటి కేబినెట్ భేటీలో ప్రధానంగా నిలవనున్నాయి.