ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొదుపు చర్యల అమలులో కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ, ఇంధన పొదుపు, వాహన వినియోగం తగ్గింపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కఠినమైన పొదుపు చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో ‘నాదేశం – నా బాధ్యత’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు చర్యలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజల్లో ఇంధన పొదుపు, విద్యుత్ వినియోగ నియంత్రణ, ఖర్చుల తగ్గింపు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
ఇకపై కొంతకాలం పాటు మంత్రుల విదేశీ పర్యటనలను రద్దు చేయాలనే ఆలోచనపై కూడా చర్చ జరిగింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించే దిశగా అత్యవసరమైన పర్యటనలు మినహా విదేశీ టూర్లను పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రంలో వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ రోజు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఉపయోగించాలని సూచించింది. ముఖ్యంగా మంత్రులు, అధికారులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలు లేదా సైకిళ్లను వినియోగించేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు.
మంత్రులు జిల్లాల పర్యటనల సమయంలో కూడా కాస్ట్ కటింగ్ చర్యలు పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరం లేని ఆర్భాటాలు, అధిక వాహన వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మంత్రుల నుంచి అధికారుల వరకు అందరూ వాహనాల సంఖ్యను, వినియోగాన్ని తగ్గించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ సమావేశాలను వీలైనంత వరకు వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కార్యాలయాల్లో భౌతిక హాజరు అవసరం లేని ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అవకాశం కల్పించే అంశంపైనా చర్చ జరిగింది. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రతలను 24 నుంచి 27 డిగ్రీల మధ్యే ఉంచాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులను తగ్గించాలని, సోలార్ ఎనర్జీ వినియోగాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇంధన, పొదుపు సూచనలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా ఖర్చుల నియంత్రణపై దృష్టి పెట్టడం రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
