Purandeswari: కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.. కానీ, ఆ విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు ? అని నిలదీశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. తిరుపతి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వ సహకారంతోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్థికి పెద్దపీట వేస్తున్నారు. కానీ, కేంద్ర సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు..? అని ప్రశ్నించారు. అందుకే.. ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించే కార్యక్రమం చేపట్టాం.. తిరుపతి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు.
Read Also: Chittoor Road Accident: చిత్తూరులో ప్రైవేటు బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు!
1700 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు పురంధేశ్వరి.. అంతర్జాతీయ హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్ రూ.311 కోట్లతో నిర్మాణం జరుగుతోందన్న ఆమె.. ఐఐటీ, ఐజర్ లాంటి విద్యాసంస్థలకు రూ.600 నుంచి 800 కోట్ల రూపాయలను అందించాం.. మెరుగైన ప్రమాణాలతో విద్యను విద్యార్థులకు అందిస్తున్నాం అన్నారు. స్మార్ట్ సిటీగా తిరుపతిని మార్చేందుకు రూ.1,695 కోట్లను కేటాయించి 87 అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం.. తిరుపతిలో 21 వేల తాగునీటి కనెక్షన్లు, 16 వేల మురుగునీరు కాలువల నిర్మాణానికి సహకారం అందించాం అన్నారు. అభివృద్ధిలో ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉన్న భారతదేశాన్ని మూడో స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రధాని మోడీ చేస్తున్నారు.. అన్ని రాష్ట్రాల సహకారం ఉంటేనే భారతదేశం అభివృద్ధిలో మూడో స్థానంలోకి రాగలదు అన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.