NTV Telugu Site icon

Purandeswari: కేంద్రమిచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari

Purandeswari

Purandeswari: దొంగ ఓట్లతో గెలవాలని జగన్ కుట్రలు చేస్తున్నారని.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. బీజేపీ సోషల్ మీడియా విభాగంతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై పురంధేశ్వరి దిశా నిర్దేశం చేశారు. ఎపిక్ కార్డులు కూడా మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు సృష్టించారని.. దొంగ ఓట్లు ఆధారంగానే జగన్ వైనాట్ 175 స్లోగన్ ఇచ్చారని ఆమె విమర్శించారు. దొంగ ఓట్లు విషయంలో ఐఏఎస్ అధికారి సస్పెన్షన్ చేయడం బీజేపీ విజయమని పేర్కొన్నారు.

Read Also: Chandrababu: చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం

వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు పూర్తిగా దూరం పెట్టాలని.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశామన్నారు. ఓటు మార్చుకునే అవకాశాన్ని కూడా‌ వైసీపీ నేతలు దుర్వినియోగం చేశారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధానాన్ని కూడా‌ బీజేపీ ఆక్షేపిస్తుందన్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ.. “ఓటర్లను భయపెట్టి, ప్రలోభ పెట్టే వారిపై దృష్టి పెడుతున్నాం.మోడీ చేసిన మంచి, జగన్ చేసిన మోసాలు ప్రజలకు వివరించండి.మోడీ అమలు చేసే పధకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎన్నికలకు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేసుకోవాలి. 23 జిల్లాల్లో పర్యటించి అక్కడ పార్టీ నేతలపై సమీక్ష చేశా. ఉపాధి హామీ పధకం కింద ఇచ్చే డబ్బు కేంద్రానిదే. అభివృద్ధి కోసం కేంద్రమిచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. సంక్షేమ పధకాల్లో లబ్ధిదారులను జగన్ ప్రభుత్వం తగ్గించేస్తుంది. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని.. తమ బియ్యంగా జగన్ వాహనాలు ద్వారా పంపిణీ చేస్తున్నారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదల కోసం మోడీ ఉచిత బియ్యం ‌ఇచ్చారు. గ్రామాల్లో నిద్రలు చేస్తూ.. అక్కడి ప్రజలకు బీజేపీ చేసిన మంచిని వివరించాలి.” అని పురంధేశ్వరి బీజేపీ సోషల్‌ మీడియా ప్రతినిధులకు సూచించారు.