Purandeshwari: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్లు అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పుడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తే 200 కోట్లు నగదు అధికారికంగా లెక్క తేల్చారని.. నాటు సారాతో ఈ సొమ్ము సంపాదించినట్లుగా తెలుస్తోందని ఆమె ఆరోపించారు. చత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ధీరజ్ సాహూ కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడుల్లో లెక్కకు మించిన నల్లధనం వెలుగు చూస్తోందన్నారు.
Read Also: Madhya Pradesh: బీజేపీకి ఓటేసినందుకు ముస్లిం మహిళపై దాడి.. బాధితురాలిని కలిసిన సీఎం..
భావసారూప్యత లేని రాజకీయ పార్టీలు మోడీని నిలువరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. బీజేపీని ఓడించడం కోసమే కూటమి అయితే అందులో ఉన్న అన్ని పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని విమర్శించారు. బెంగళూరులో ఒక కాంగ్రెస్ నేత ఇంటిపై దాడులు జరిగితే 42 కోట్ల రూపాయల నగదు అధికారులు గుర్తించారని ఆమె చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని చటర్జీ అనే మంత్రి ఇంట్లో రూ. 50 కోట్లు నగదు లభ్యం అయిందన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో పీయూష్ జైన్ ఇంట్లో రూ. 200 కోట్లు లభ్యం అయిందని ఆమె వెల్లడించారు. 2022 జూలైలో సత్యేంద్ర జైన్ ఇంట్లో రూ. 3 కోట్లు , బంగారం, ఝార్ఖండ్‌లో బొగ్గుగనుల స్కాంలో రూ.1500 కోట్లు, ఉపాధి హామీ పనుల్లో రూ500 కోట్లు స్కాం జరిగిందనే విషయాలు వెలుగుచూశాయని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.