ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ ప్రారంభం కానుంది. సభా కార్యక్రమాల్లో పలు కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ అంశాలపై చర్చలు జరగనున్నాయి. మరోవైపు శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి.
రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నివేదికను సీఎం చంద్రబాబు సభ ముందు ఉంచనున్నారు. అలాగే గ్రంథాలయాల సవరణ బిల్లును మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ ప్రజా సంక్షేమ పథకాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రజా సమస్యలపై సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, వాణిజ్య పన్నుల బకాయిలు, కరువు ప్రభావిత మండలాలు, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, వక్ఫ్ భూముల కేటాయింపు వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
అలాగే లేబర్ అడ్డాలు, నేతన్న సేవలో పథకం, సామాజిక మాధ్యమాల్లో తప్పుదారి పట్టించే సలహాలు, జీవోఎంఎస్ నంబర్ 3 పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. వీటిపై సంబంధిత మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రతిని కూడా సభా సమక్షంలో ఉంచనున్నారు. ఆంధ్రప్రదేశ్ అత్యవసర సేవల నిర్వహణ చట్టంలోని సెక్షన్ 2(2)ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభ ముందు ఉంచనున్నారు.
శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. పాఠశాలల మూసివేత నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు పలు అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. వక్ఫ్ భూములు, నేతన్న సేవలో పథకం, కరువు ప్రభావం, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు వంటి అంశాలపై మండలిలో చర్చ జరిగే అవకాశం ఉంది. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సూపర్ సిక్స్ పథకాల అమలు, గ్రంథాలయ సవరణ బిల్లు, ప్రజా సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలు ప్రధానంగా నిలవనున్నాయి.

