వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కమీషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అవుతున్నారని, ఉపాధ్యాయులకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని మంత్రి లోకేశ్ చెప్ప్పుకొచ్చారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ప్రసంగించారు. ‘ఎన్నికలకు రెండు నెలల ముందు గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. గత ఐదేళ్లలో ఉద్యోగ నియమకాలు సున్నా. డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ఉపాధ్యాయులపై వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తాం. టీడీపీ హయాంలో మొత్తంగా 15 సార్లు డీఎస్సీ నిర్వహించాం. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులకు వయో పరిమితిని పెంచేలా చర్యలు చేపడుతున్నాం’ అని మంత్రి లోకేశ్ చెప్పారు.
Also Read: Nimmala Ramanaidu: గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తాం: మంత్రి నిమ్మల
‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్‌లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తాం. ఉపాధ్యాయులకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఉపాధ్యాయులు విద్యపైన మాత్రమే దృష్టి పెట్టేలా మేం ప్రణాళిక వేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.