గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం అని మంత్రి అనగాని హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ‘ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రభుత్వానికి 8,305 ఫిర్యాదులు వచ్చాయి. 7,873 ఎకరాల భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్దారించాం. కబ్జా అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములపై పరిశీలన కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో 13 లక్షల 59వేల 505 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు. 25 వేల 276 ఎకరాలు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించాం. వీటిలో నిబంధనలకు విరుద్దంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు నిర్దారించాం. ఇప్పటి వరకు రెవెన్యూ సంబంధించి 70 వేల ఫిర్యాదులు రాగా.. 8,305 ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులే ఉన్నాయి’ అని మంత్రి అనగాని తెలిపారు.
Also Read: Nara Lokesh: అప్పటి లోగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం: మంత్రి లోకేశ్
‘భూ కబ్జాల నివారణకోసం నూతనంగా ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టాన్ని తీసుకువస్తున్నాం. భూ కబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకువస్తున్నాం. భూ కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా, పేదల భూములు అన్యాక్రాంతం కాకూడదనే కొత్త చట్టం తెస్తున్నాం. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారు, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయి. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తాం’ అని మంత్రి అనగాని హెచ్చరించారు.