Constitution Day: కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు: అనురాగ్ ఠాకూర్

Anurag Thakur

Anurag Thakur

బీజేపీ ఎస్సి మోర్చ ఆధ్వర్యం లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ దివస్ కార్యక్రమంలో  కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొని పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 1949 నవంబర్ 26న ఆమోదించబడి, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగ రూపకల్పనలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, ఎన్.జి. రంగా, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి తెలుగు ప్రముఖుల పాత్ర ఎంతో ఉందని ఆయన గుర్తుచేశారు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది 1948 సెప్టెంబర్ 17న సర్దార్ పటేల్ కృషితో హైదరాబాద్ భారత్‌లో విలీనమైందని, అందుకే ఒకే దేశం, ఒకే రాజ్యాంగం విలువ హైదరాబాద్ ప్రజలకు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారని, అంబేద్కర్‌కు సంబంధించిన ఐదు ప్రాంతాలను ‘పంచ తీర్థాలు’గా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఠాకూర్ తెలిపారు. ప్రతి పౌరుడు పీఠిక, ప్రాథమిక హక్కులు, విధులు, ఓటు హక్కు గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 రద్దు, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా వంటి సంస్కరణలు తెచ్చిందని వివరించారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తీరుపై అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కాంగ్రెస్ అంబేద్కర్‌ను ఎన్నికల్లో ఓడించిందని, ఆయనకు భారతరత్న ఇవ్వకుండా దశాబ్దాల పాటు ఆలస్యం చేసిందని ఆరోపించారు. 1975లో ఎమర్జెన్సీ విధించి, 42వ సవరణ ద్వారా రాజ్యాంగ ఆత్మను మార్చడమే కాకుండా, స్నేహలత రెడ్డి వంటి పోరాట యోధులను జైల్లో పెట్టారని అన్నారు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి 90కి పైగా ప్రభుత్వాలను కూల్చారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో సీనియారిటీని ఉల్లంఘించారని విమర్శించారు. 1984 సిక్కుల ఊచకోతకు, సొంత పార్టీ నేతలైన పీవీ నరసింహారావు, సీతారాం కేసరిలను అవమానించినందుకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల వ్యాఖ్యలలో వైరుధ్యం ఉందని ఠాకూర్ విమర్శించారు. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు, ఎన్నికల సంఘం పనితీరు బాగుందని చెప్పడం, ఓడిపోతే వాటిని తప్పుబట్టడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ విదేశాల్లో విమర్శలు చేస్తుంటే, రేవంత్ రెడ్డి 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.