Anti-Immigration Rally: ఆస్ట్రేలియాలో ఆదివారం ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ అనే వలస వ్యతిరేక ర్యాలీని అక్కడి ప్రజలు నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది ఆస్ట్రేలియన్లు పాల్గొన్నారు. వారి ప్రదర్శనలో ప్రముఖంగా భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఈ వలస వ్యతిరేక ర్యాలీని ఖండించింది. వాళ్లు నిర్వహించిన ప్రదర్శనలను ద్వేషాన్ని రెచ్చగొట్టేవిగా ఉన్నాయని చెప్పింది. ఆస్ట్రేలియా జనాభాలో మూడు శాతం మంది భారత సంతతికి చెందిన వాళ్లు ఉన్నారు. ఈసందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. ఐదేళ్లలో వచ్చిన భారతీయుల సంఖ్య 100 ఏళ్లలో వచ్చిన గ్రీకులు, ఇటాలియన్ల సంఖ్య కంటే ఎక్కువ అని అన్నారు.
READ ALSO: YS Jagan: వైఎస్ జగన్‌కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్.. ఏమన్నారంటే?
సిడ్నీ – మెల్బోర్న్ లో నిరసనలు
సామూహిక వలసలను అంతం చేసే లక్ష్యంతో ఆస్ట్రేలియన్లను ఏకం చేయడానికి నిర్వాహకులు ఈ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఈక్రమంలో సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, ఇతర నగరాల్లో పెద్ద ర్యాలీలు జరిగాయి. సిడ్నీలో 5 – 8 వేల మంది ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్లకు వ్యతిరేకంగా రెఫ్యూజీ యాక్షన్ కోయలిషన్ నిర్వహించిన ర్యాలీ కూడా వీళ్లకు సమీపంలోనే జరిగింది. ర్యాలీల నేపథ్యంలో సిడ్నీలో వందలాది మంది అధికారులను మోహరించామని, ఎక్కడ పెద్ద సంఘటనలు లేకుండా నిరసన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయని పోలీసులు తెలిపారు. మెల్బోర్న్‌లో నిరసనకారులు ఫ్లిండర్స్ స్ట్రీట్ స్టేషన్ వెలుపల ఆస్ట్రేలియన్ జెండాలు, వలస వ్యతిరేక ప్లకార్డులతో కవాతు చేశారు. ఈసందర్భంగా నిరసనకారుడు థామస్ సెవెల్ మాట్లాడుతూ.. ఈ వలసలను ఆపకపోతే ఆస్ట్రేలియన్లు నాశనం అవుతారని అన్నారు. అనంతరం పలువురు నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఘర్షణలో ఇద్దరు అధికారులు గాయపడ్డారని, ఆరుగురు నిరసనకారులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మెల్బోర్న్ ర్యాలీ మొత్తం 5 వేల మందికి పైగా నిరసనలకు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
నిరసనలను ఖండించిన రాజకీయ పార్టీలు..
ఈ ర్యాలీలను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. ఫెడరల్ కార్మిక మంత్రి ముర్రే వాట్ మాట్లాడుతూ.. ‘ఈరోజు జరుగుతున్న మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా ర్యాలీని తాము తీవ్రంగా ఖండిస్తున్నాము, దాని ఉద్దేశ్యం సామాజిక సామరస్యాన్ని పెంచడం కాదు. ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, మన సమాజాన్ని విభజించే ఇటువంటి ర్యాలీలకు తాము మద్దతు ఇవ్వము’ అని ఆయన అన్నారు.