Anil Ravipudi: టాలీవుడ్లో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఎన్టీవీ నిర్వహించిన ప్రత్యేక పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని తన సినిమా ప్రయాణం, విజయ రహస్యాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన డైరెక్షన్ గురించి, నటులతో అనుబంధం, భవిష్యత్తు ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన సినిమాల్లో హాస్యం ప్రధానంగా ఉన్నప్పటికీ, దాని వెనుక బలమైన భావోద్వేగాలు, అండర్‌కరెంట్ మెసేజ్ ఉంటాయని పేర్కొన్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కథతో మమేకం చేసే అంశాలు ఉంటేనే సినిమా విజయవంతం అవుతుందని వెల్లడించారు. ముఖ్యంగా స్క్రిప్ట్ రాసే సమయంలో రచయితగా, సెట్స్‌పైకి వెళ్లాక దర్శకుడిగా ఉండటమే తన విజయ సూత్రమని స్పష్టం చేశారు.
READ ALSO: Aroori Ramesh : బీజేపీకి బిగ్ షాక్.. పార్టీని వీడిన ఆరూరి రమేష్..
తన సినిమాలకు దాదాపు 80 శాతం కుటుంబ ప్రేక్షకులు వస్తారని, వారిని అలరించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. ‘ఎఫ్-2’, ‘ఎఫ్-3’ వంటి చిత్రాలు కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా ఉండటం వల్లే అంతటి విజయం సాధించాయని తెలిపారు. స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు వారి ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుంటూనే, తనదైన మార్కు వినోదాన్ని జోడిస్తానని వెల్లడించారు. ప్రముఖ నటులు వెంకటేష్, బాలకృష్ణ వంటి వారితో తనకున్న అనుబంధం గురించి అనిల్ మాట్లాడుతూ.. వారు ఇచ్చే స్వేచ్ఛ వల్లే అద్భుతమైన అవుట్‌పుట్ వస్తుందని తెలిపారు. రిమేక్ సినిమాల కంటే కొత్త సబ్జెక్టులకే తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై మాట్లాడుతూ.. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుందని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ, ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడమే తన ముందున్న లక్ష్యమని ఈ పాడ్‌కాస్ట్‌లో అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
READ ALSO: Health Tips: ఈ లక్షణాలు ఉంటే మీకు రక్తపోటు ఉన్నట్లే.. !