Andhrapradesh: ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులతో కలిసి అంగన్వాడీలతో సుదీర్ఘంగా చర్చించారు. జులై నెలలో అంగన్వాడీలకు జీతాల పెంపునకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అంగన్వాడీలు కోరినట్లు, రాతపూర్వకంగా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వ హామీతో అంగన్వాడీలు సమ్మె విరమించారు.
Read Also: Ayodhya : నేటి నుంచి సామాన్యులకు బాలరాముడి దర్శనం..
ఇవాళ ఆఖరిగా అంగన్వాడీలతో చర్చించామని.. 11 డిమాండ్లు కూడా అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. జీతాల అంశంపై జులై నెలలో పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రమోషన్ వయోపరిమితి 50 సంవత్సరాలు చేస్తామని, ప్రైమ్ ఏరియా, ట్రైబల్ ఏరియాలుగా విభజిస్తామన్నారు. మట్టి ఖర్చులకు 20 వేలు ఇవ్వడానికి అంగీకరించామని.. సమ్మె కాలంలో జీతం ఇవ్వడం జరుగుతుందన్నారు. సీఎంతో చర్చించి సమ్మె కాలంలో పెట్టిన కేసులు మాఫీ చేస్తామన్నారు. పని చేసే సమయంలో యాప్‌ల వంటి సమస్యలపై స్పెషల్ సీఎస్‌తో గైడ్ లైన్స్ తయారు చేయాలని చెప్పామన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని.. ఏ ఒక్కరి మీదా కక్ష సాధింపు చర్య లేదని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే ఒంటెద్దు పోకడ కాదు కనుక అందరితో చర్చించామన్నారు.
Read Also: Minister Botsa Satyanarayana: విధులకు హాజరు కండి, ఆందోళన విరమించండి.. అంగన్వాడీలకు విజ్ఞప్తి
చర్చలను మేం అంగీకరించామని, సమ్మెను విరమించినట్లు అంగన్‌వాడీ నాయకులు ప్రకటించారు. ఇకపై తాము విధుల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. జీతాలు పెంపుపై నిర్దిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తాం అన్నారని ఏపీ అంగన్వాడీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ వెల్లడించారు. రిటైర్మెంట్ బెనిఫిట్‌ను పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. అంగన్‌వాడీలకు ప్రత్యేకంగా వైఎస్సార్ బీమా, అంగన్‌వాడీల బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పిందన్నారు. టీఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచీ వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుందని.. సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపుచేస్తామని వెల్లడించారు. సమ్మె కాలానికి జీతం ఇస్తాం అని, కేసులు ఎత్తేస్తాం అని ప్రభుత్వం అంగీకరించిందన్నారు. మూడు రోజుల్లో మాకు మినిట్స్ ఇస్తాం అన్నారని ఏపీ అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు బేబీ రాణి తెలిపారు. కమిటీ వివరాలు మాకు అందిస్తాం అన్నారని వెల్లడించారు.