NTV Telugu Site icon

Andhrapradesh: ఏపీ విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం

Andhrapradesh

Andhrapradesh

Andhrapradesh: విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై విద్యుత్ జేఏసీ – యాజమాన్యాల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. విద్యుత్ ఉద్యోగుల రివైజ్డ్ పే స్కేళ్లను యాజమాన్యం ఖరారు చేసింది. సింగిల్ మాస్టర్ స్కేల్‌తో కూడిన పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సంతకాలు చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం 8 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం 2022 ఏప్రిల్ 1 తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమల్లోకి రానుంది.12 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. పే స్కేళ్లలోని లోటుపాట్లను సరిచేసేందుకు ట్రాన్స్ కో జేఎండీ నేతృత్వంలో మూడు డిస్కమ్‌ల సీఎండీలతో కమిటీని ఏర్పాటైంది. కొత్తగా అమల్లోకి రానున్న సింగల్‌ మాస్టర్‌ స్కేలుతో కూడిన పీఆర్సీ ఒప్పందంపై ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు, ఏపీ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) ప్రతినిధులు, పలు యూనియన్ల నాయకులు సంతకాలు చేసి పరస్పరం ఒప్పందాలను ఖరారు చేసుకున్నారు. పెరిగిన పీఆర్సీతో 28 వేలకి పైగా ఉద్యోగులకి లబ్ధి చేకూరనుంది.

Read Also: Srisailam: తిరుమల చిన్నారిపై చిరుత దాడి ఘటన.. శ్రీశైల దేవస్థానం అలర్ట్

మొత్తం 12 డిమాండ్లలో 9 డిమాండ్లు ప్రభుత్వం సానుకూలం చేసిందని విద్యుత్ జేఏసీ ఛైర్మన్‌ చంద్రశేఖర్ తెలిపారు. మిగిలిన 3 డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించి త్వరలో నిర్ణయిస్తామని అధికారులు చెప్పారన్నారు. పీఆర్సీ ఫిట్మెంట్ 8 శాతం అనేది కొత్త విధానమని.. కొత్త విధానాలకు ఉద్యోగులు అలవాటుపడాలన్నారు. పాత విధానంలో పీఆర్సీ ఫిట్మెంట్ రాలేదని ఆలోచించవద్దన్నారు. ప్రభుత్వంతో సహకరించి పని చేసుకోవాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. అగ్రిమెంట్ చేసి.. మిగిలిన మూడు డిమాండ్లు త్వరలో ఇవ్వాలని కోరామన్నారు.

ఆగస్టు 9 తేదీ తరవాత నాలుగు విడతలుగా ఉద్యోగుల జేఏసీ, యాజమాన్యం మధ్య చర్చలు జరిగాయి. మాస్టర్ స్కేల్, ఫిట్మెంట్, పీఆర్సీ , జేఎల్ఎం గ్రేడ్ 2, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై విద్యుత్ ఉద్యోగుల చర్చలు జరిగాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను 2018 రివైజెడ్ పే స్కేల్ ప్రకారం సవరిస్తూ ఈ నెల 14న ట్రాన్స్ కో ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Show comments