విశాఖ వేదికగా యోగాంధ్ర-2025ను విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వంటి ప్రముఖులు అంతర్జాతీయ యోగాడేలో పాల్గొనున్నారు. ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఎంపిక చేశారు. వర్షాలు లేదా భద్రత కారణాల వల్ల మార్పు చేయాల్సి వస్తే.. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ సిద్ధం అయింది.
3.5 లక్షల నుంచి ఐదు లక్షల మంది జన సమూహం సామూహిక యోగాభ్యాసం కోసం తరలిరానున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 32 కిమీ వెంబడి యోగా కోసం ప్లేస్‌లు ఎంపిక చేశారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 10 వేల మందికి తగ్గకుండా యోగాలో పాల్గొనే విధంగా స్థానిక యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల నుంచి 3.5 లక్షల నుంచి 5 లక్షల మందిని యోగా వేడుకలకు తరలించేలా చర్యలు చేపడుతున్నారు. బీచ్ రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల్లో 268 కంపార్ట్‌మెంట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క కంపార్ట్‌మెంట్ దగ్గర సౌకర్యాల పరిశీలన కోసం రెవెన్యూ, పోలీసు యంత్రాంగంకు బాధ్యతలు అప్పగించారు.
Also Read: Daggubati Purandeswari: పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం!
ప్రధాని పర్యటన, యోగాంధ్ర-2025 ఏర్పాట్లను మరికొద్ది సేపట్లో స్వయంగా సీఎం చంద్రబాబు పరిశీలించి సమీక్ష నిర్వహిస్తారు. రికార్డు స్థాయిలో యోగాంధ్ర విజయవంతం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం అని కలెక్టర్ హరేంద్రి ప్రసాద్ అంటున్నారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్- వన్ హెల్త్’ నినాదంతో ఈ ఏడాది సీఎం చంద్రబాబు అధ్యక్షతన విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి.