కిర్గిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడి ఆంధ్రాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి దాసరి చందు (21) మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలిసి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబంలో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు తమ కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా సహాయం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
ఇది కూడా చదవండి: Neha Murder Case: నేహ తండ్రికి క్షమాపణ చెప్పిన సీఎం సిద్ధరామయ్య..
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన దాసరి చందు కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏపీకి చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఆదివారం ఆయన జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. జలపాతాన్ని సందర్శిస్తుండగా గడ్డకట్టిన మంచులో చిక్కుకుని చందు ప్రాణాలు కోల్పోయాడు. చందు మరణవార్త సోమవారం తల్లిదండ్రులకు తెలిసింది. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan : పిఠాపురం జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్
తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంప్రదించినట్లు చందు తల్లిదండ్రులు తెలిపారు. కేంద్ర మంత్రి కిర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, మృతదేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు. యూనివర్సిటీలో పరీక్షలు ముగిశాక.. సమీపంలోని జలపాతం దగ్గరకు యాజమాన్యం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సెల్ఫీ దిగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. అనకాపల్లి ఎంపీ సత్యవతి చొరవతో చందు డెడ్‌బాడీ తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.