Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూర్ మున్సిపాలిటీ గ్రేడ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్‌లో ఉన్న కదిరి మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. గడచిన రెండేళ్లలో కదిరి మున్సిపాలిటీ సాధించిన ఆదాయం, చేసిన వ్యయాలను పరిగణలోకి తీసుకుని ఈ హోదా పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూర్ మున్సిపాలిటీ హోదాను గ్రేడ్–3 నుంచి గ్రేడ్–1కు పెంచారు. 2021 సంవత్సరం నుంచి మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన గ్రేడ్ పెంపు ఉత్తర్వులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీ హోదా పెరగడంతో ఆయా పట్టణాలకు అదనపు నిధులు, సిబ్బంది, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు.
READ MORE: Delivery Partners: ఫుడ్ లవర్స్ కు జొమాటో-స్విగ్గీ షాక్.. డెలివరీ బాయ్స్ కు మాత్రం పండగే..