Deputy CM Narayana Swamy: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.. కొన్ని సార్లు సొంత పార్టీ నేతలు.. మరికొన్ని మార్లు విపక్షాలను టార్గెట్ చేస్తూ ఉంటారు.. అయితే, తాజాగా, కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీపై నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు.. హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. సోనియా గాంధీపై అవాస్తవాలు మాట్లాడిన నారాయణస్వామిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు టి.పీసీసీ నేత మల్లు రవి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సోనియా గాంధీ అధిక ప్రాధాన్యత ఇచ్చారని.. హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక విమానాలు పంపించి.. వైఎస్ జాడ కోసం వెతికించారని, వాతావరణం సరిగా లేకపోవడం వల్లే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారని గుర్తుచేశారు మల్లు రవి. అయితే, తెలంగాణాలో కేసు నమోదుపై సంచలనం వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..
Read Also: Medical Student Preeti: మళ్లీ తెరపైకి మెడికో ప్రీతి కేసు.. నిందితుడు సైఫ్‌కు సస్పెన్షన్ పొడిగింపు
బేగంబజార్ పీఎస్‌లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో చంపారని రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందన్నారు. వాళ్లు ఇద్దరు కలసి వైఎస్ ను చంపారని ప్రజలందరికి తెలుసంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సందేహాన్ని తీర్చే శక్తి సోనియాగాంధీకి చంద్రబాబుకు లేదన్న ఆయన.. చంద్రబాబుకు రాజకీయ బిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డే అన్నారు. చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి రాజశేఖర్ రెడ్డిని హింసించి పొట్టన పెట్టుకుంది మీకు తెలియదా..? అని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయని వ్యక్తి.. ఎవడికి భయపడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్ ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి.. 16 నెలలు జైల్లో పెట్టారు అని ఆరోపణలు గుప్పించారు. అప్పుడు ఏమైంది..? మీ నోర్లు ఎక్కడి పోయాయి..? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. చంద్రబాబు మనిషి.. రేవంత్ రెడ్డి గెలవడానికి చంద్రబాబు డబ్బులు పంపించారని విమర్శించాడు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.