Andhra Pradesh Cyclone Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి తుఫాన్‌ ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Delhirain

Delhirain

Andhra Pradesh Cyclone Alert: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈ రోజు వాయుగుండంగా మారి, పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశముందని తెలిపింది. అనంతరం మరింత బలపడి, ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.

మూడు రోజుల పాటు వర్షాలు
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవవచ్చని, మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి?
ఇక, ఇవాళ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. రేపు అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సోమవారం రోజు రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాడు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక, బుధవారం రోజు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

తీర ప్రాంతాల్లో బలమైన గాలులు
తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు.. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు, రైతులు తమ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు
తుపాను సమాచారం, అత్యవసర సహాయం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఇందుకోసం 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు, రైతులు, తీర ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.