CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే ఆ హింసపై ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు, శాంతిభద్రతలు, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం రక్షణ కల్పించాలని అడగాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో గతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు ఒక ప్రణాళిక ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేశారు చంద్రబాబు.
2024లో ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారు
2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి తిరుగులేని విజయాన్ని అందించారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే బాధ్యతను తమకు అప్పగించారని, 94 శాతం స్ట్రైక్ రేట్‌తో పాటు 57 శాతం ఓటు షేర్‌ను ప్రజలు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గతంలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను తిరిగి నిలబెట్టామని చంద్రబాబు అన్నారు. మూడోసారి సీఐఐ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో కొత్త నమ్మకం ఏర్పడిందని, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
Also Read
- CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
- AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
- AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
- Andhra Pradesh Cyclone Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొంటూనే ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు చంద్రబాబు. గత ప్రభుత్వం 96 పథకాలకు సంబంధించిన నిధులను దారి మళ్లించడంతో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఆర్థిక సంఘం నిధులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా కోతకు గురయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక స్వపరిపాలన సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే సుపరిపాలన సాధ్యమని, తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు.. ఇలాంటి కీలక సమయంలో ఎన్నికలను అడ్డుకునేందుకు 59 పిటిషన్లు దాఖలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై కూడా పిటిషన్లు వేశారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియను, వార్డుల పునర్విభజనను కూడా వివాదాల్లోకి లాగుతున్నారని విమర్శించారు చంద్రబాబు. అన్ని అడ్డంకులను అధిగమించి ఎన్నికలు నిర్వహిస్తుంటే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ మొదటి రోజు నుంచే కుట్రపూరిత ధోరణి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఎన్నికలు వచ్చినప్పుడు తాను ఎప్పుడూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను గౌరవిస్తానని చంద్రబాబు చెప్పారు. గతంలో ఎన్నికల సమయంలో ప్రజల అభిప్రాయాలను సేకరించేవాడినని గుర్తుచేశారు. తాను ఎంతోమంది నాయకులను చూశానని, వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా చూశానని, అయితే ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు చంద్రబాబు.
ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అంతర్రాష్ట్ర ముఠాలను తీసుకొచ్చి ఆయుధాలతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులపై దాడులు జరిగాయని, తంబళ్లపల్లిలో జనసేన కార్యాలయంపై, ఎర్రగుంటలో బీజేపీ నాయకులపై దాడులు చేశారని పేర్కొన్నారు. గతంలో ఉన్న హింస, అరాచక ధోరణులే మళ్లీ కనిపిస్తున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే భావనను సృష్టిస్తున్నారని విమర్శించారు. హింసకు పాల్పడుతున్నవారే పిటిషన్లు వేస్తున్నారని ఆరోపించారు.
ఇక, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబాయ్‌ను హత్య చేసి, ఆ ఘటనను ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ ప్రచారం చేశారని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేయడానికి కూడా ధైర్యం కావాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్నికల విషయంలోనూ ఇదే ధోరణిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారని వైసీపీపై ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక అబద్ధాన్ని మూడుసార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్మీట్లు పెట్టి వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదని, ఎవరూ అలా వ్యవహరించరని వ్యాఖ్యానించారు.
గతంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద విధులు నిర్వహించేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని చంద్రబాబు విమర్శించారు. అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేంద్ర బలగాలు కావాలని కోరారంటే, నాటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల వివరాలను చంద్రబాబు వెల్లడించారు. మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. అలాగే 659 స్థానాలకు సంబంధించి 1,815 నామినేషన్లు వైఎస్సార్సీపీ అభ్యర్థులు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
కొత్త విధానంలో ప్రజలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్ తన మేనకోడలి పెళ్లిని అడ్డుకునే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ను కంసుడి మామతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు రాజకీయ, కుటుంబ, నైతిక విలువలు లేవని విమర్శించారు. ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా కొడుకుగా, అన్నగా, మేనమామగా కూడా జగన్ విఫలమయ్యారని అన్నారు. మళ్లీ ‘గొడ్డలి పార్టీ’ అధికారంలోకి వస్తే ఏమవుతుందోనని ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతూ, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి అభివృద్ధిని కొనసాగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు…
తాజావార్తలు
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
-
Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!