TDP and BJP: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నేతల వాయిస్ మారుతోంది. కొంతకాలం క్రితం వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేసిన సోము వీర్రాజు.. ఇప్పుడు స్వరం మారుస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చలను నెగటివ్‌గా చూడొద్దంటూ సరికొత్త చర్చకు తెరదీశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… అమిత్ షాను సీనియర్ నేత చంద్రబాబు కలిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీ చర్చల్లో ఏం జరిగిందో తెలియాలంటే.. గ్రేట్ లీడర్ చంద్రబాబునే అడగాలాంటూ పొత్తులపై తన మాట దాటేశారు.
బీజేపీ అగ్రనేతలు- చంద్రబాబు తాజా రాజకీయాలతో పాటు, ఇతర అంశాలపైనా చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భేటీ తర్వాత.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రచారం ఊపందుకుంది. టీడీపీతో బీజేపీ పొత్తు ఉండదని గతంలో సోము వీర్రాజు, జీవీఎల్ వంటి కీలక నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబుపై తరచూ విమర్శలు చేసే సోము వీర్రాజు.. తాజాగా పొత్తులు ఉండవని నేరుగా ప్రకటించలేదు. అలాగని గతంలో చేసినట్లు టీడీపీపై విమర్శలు చేయలేదు. దీంతో సోము వీర్రాజు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. మరోవైపు పొత్తులపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్ అవుతున్నాయి. అమిత్ షా, చంద్రబాబు భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, పొత్తు అజెండా లేనేలేదని కొట్టిపారేశారు. బీజేపీ అగ్రనేతలతో పొత్తులపై చర్చలు జరిగాయో లేదో అనేదానిపై ఇంతవరకు ఇరు పార్టీల నుంచి క్లారిటీ రావట్లేదు. కానీ అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతోనే ముందుకెళ్తాయనే టాక్ వినిపిస్తోంది. పొత్తుపై మాట దాటవేస్తూనే చంద్రబాబుపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు చేయకపోవడంతో మరింత చర్చకు తావిస్తోంది.